మహబూబ్‌నగర్ నగర పాలకలో దుకాణాల అద్దెకు సంబంధించి రూ.20.44 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొత్తం 258 షాపులు ఉండగా.. నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉన్నది. అయితే దుకాణాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు సమీక్షించగా.. చాలా వాటికి అగ్రిమెంట్లు లేకపోవడంతో అవాక్క య్యారు. నోటీసులు జారీ చేసినా.. ముందుకు రావడం లేదు. ఎప్పుడు చూసినా దుకాణాలకు తాళాలు వేసి ఉంచుతున్నారే కానీ నగరపాలక సంస్థకు సైతం అప్పగించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. దుకాణాలకు తాళాలు వేసి ఏండ్లుగా డబ్బులు చెల్లించని 74 దుకాణాలను ఇప్పటికే సీజ్ చేశారు. దీనికితోడు వసూళ్లల్లో తేడాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సిబ్బంది, వ్యాపారులు చెబుతున్న బకాయిలకు రూ.లక్షల్లో వ్యత్యాసం ఉండడంతో మున్సిపల్ ఖాతాలో జమ చేయకుండా.. సిబ్బంది స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నగర పాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 29 : మహబూబ్‌నగర్ నగర పాలక సంస్థ పరిధిలో దుకాణాల అద్దె చెల్లింపులు ఆటవిడుపు వ్యవహారంగా మారింది. మున్సిపల్ దుకాణాలపై జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత అధికారులతో ఆయా దుకాణాలకు సంబంధించి దస్ర్తాలు, అగ్రిమెంట్లు, తదితర అంశాలపై సమీక్షించారు. అయితే చాలా దుకాణాలకు అగ్రిమెంట్లు, దస్ర్తాలు లేకపోవడంతో అధికారులంతా షాక్‌కు గురయ్యారు. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో వేలంలో పొందిన దుకాణాలకు తాళాలు వేసి అద్దెలు ఏళ్లుగా చెల్లించని వ్యాపారులపై కొరడా ఝుళిపించారు.
7 ప్రాంతాల్లో 258 దుకాణాలు
మహబూబ్‌నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తా, బస్టాండ్, న్యూటౌన్, పద్మావతి కాలనీ, టీడీ గుట్ట.. ఇలా మొత్తం 7 ప్రాంతాల్లో నగర పాలక సంస్థకు సంబంధించిన 258 దుకాణాలు ఉన్నాయి. వేలంలో పోటాపోటీగా షాపులు దక్కించుకున్న వ్యాపారులు అద్దెల చెల్లింపులో మాత్రం మొండికేస్తున్నారు. ఆ దుకాణాల నుంచి ప్రతినెలా అద్దె వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని దక్కించకున్న వ్యాపారులు.. అద్దెలు చెల్లించడం లేదు. దీంతో సుమారు రూ.20.44 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఒక్క గడియారం చౌరస్తాలోనే దుకాణాల నుంచి సుమారు రూ.5 కోట్లకుపైగా అద్దె డబ్బులు రావాల్సి ఉందని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. దుకాణాల అద్దె వసూళ్ల ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. సిబ్బంది వసూళ్ల కోసం వెళ్తే దుకాణాలకు తాళాలు వేసుకొని కొందరు వ్యాపారులు ఉడాయిస్తున్నారు.
సిబ్బంది చేతివాటంపై ఆరోపణలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ సిబ్బంది, వ్యాపారులు చెబుతున్న బకాయీలకు రూ.లక్షల్లో తేడా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోన్నది. డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీ ఖాతాలో జమచేయకుండా.. గతంలో సిబ్బంది స్వాహా చేశారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆడిటింగ్ నిర్వహించి నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండి పడకుండా చూడాలని జనం కోరుతున్నారు. నోటీసులు జారీ చేసి గడువు విధిస్తున్నా వ్యాపారులు ముందుకొచ్చి అద్దె బకాయిలు చెల్లించడం లేదు. కనీసం తాళాలు వేసిన దుకాణాలనైనా నగరపాలక సంస్థకు అప్పగించడం లేదు. దీంతో అధికారులు వ్యాపారులపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
గడియారం కూడలిలో కర్ఫ్యూ వాతావరణం
అద్దె బకాయీలు రూ.20.44 కోట్లకు చేరడంతో అధికారులు, వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. చివరకు గడియారం చౌరస్తాతోపాటు మొత్తం 74 దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాలు మూతపడటంతో గడియారం చౌరస్తాలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. బకాయిలో 50 శాతం చెల్లిస్తేనే దుకాణాల తాళాలు ఇస్తామని నగరపాలక సంస్థ అధికారులు తేల్చిచెప్పడంతో వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒప్పందం ప్రకారం నెలనెలా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నామని.. మధ్యలో ఒకేసారి అద్దెలు పెంచారని.. ఆ బకాయిలు తాము చెల్లించడం లేదని, డబ్బులున్న వారు చెల్లిస్తారని, లేనివారం వ్యాపారం మానుకుంటామని చెబుతున్నారు. గడువు ఇస్తామని అద్దెలు వసూలు చేయబోమన్న అధికారులు.. ఇప్పుడు వాటిని చెల్లించాలని పట్టుబడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. బకాయిల వసూళ్లలో సిబ్బంది చేతివాటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధికి సహకరించండి.. అద్దెలు చెల్లించండి..
నగర పాలక సంస్థ అభివృద్ధిలో వ్యాపారులూ భాగస్వాములే. ప్రజా సంక్షేమంలో భాగంగా చేపడుతున్న రోడ్లు, కాల్వలు, నీటి సరఫరా, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారులు.. ఇలా అనేక రకాల పథకాలకు అవసరమైన నిధులు సమకూరాలంటే మున్సిపల్ పరిధిలోని దుకాణాల అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి భారంగా ఉంటే మొదట 50 శాతం చెల్లించాలంటున్నాం.. అయినా స్పందించడం లేదు. దయచేసి అభివృద్ధికి సహకరించండి.. వెనక్కి తగ్గేది లేదు. టెండర్ పూర్తయిన దుకాణాలకు తిరిగి వేలం నిర్వహిస్తాం. తాళాలు వేసుకొని బకాయిలు చెల్లించకుండా తప్పించుకుంటున్న వాటిని స్వాధీనం చేసుకుంటాం.
– ప్రవీణ్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్, పాలమూరు