వనపర్తి, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలని, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అనేక మంది మహనీయులు చెబుతున్నారు. ముఖ్యంగా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది. గ్రామాలకు పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది. ప్రస్తుతం ఎనిమిది నెలలుగా గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. ఇక నిధుల విషయంలోనూ గ్రామ పంచాయతీలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది.
గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేదిస్తున్నది. అభివృద్ధి సంగతి అటుంచితే.. కనీసం ట్రాక్టర్ మెయింటనెన్స్లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతున్నది. చాలా గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ పైపు వేయాలన్నా.. మోటరు కాలిపోతే రిపేరు చేయాలన్నా కష్టతరమవుతున్నది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలుండగా 45 జీపీల్లో మాత్రం కొన్ని డబ్బులు ఉన్నప్పటికీ మరో 210 జీపీల్లో ఎందుకు కొరగాని విధంగా నిధులున్నాయి. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోగా, అభివృద్ధి పనులవైపు కన్నెత్తి చూసే పరిస్థితులు లేవు. వర్షాకాల సీజన్లో కనీసం ఒక్కసారైనా ఫాగింగ్ చేసే పరిస్థితులు గ్రామ పంచాయతీల్లో కానరావడం లేదు. అన్ని యంత్రాలు మూలకు చేరడంతో వాటి దుమ్ము కూడా దులిపే పరిస్థితి లేదు.
కార్యదర్శులకు తప్పని కష్టాలు
గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిన అనంతరం ఆ బాధ్యతలన్నీ పంచాయతీ కార్యదర్శి భుజాలపై పడ్డాయి. అంతకుముందు ఏ సమస్య వచ్చినా సర్పంచ్ మెడకు చుట్టుకునేది. ఇక రెండు బాధ్యతలను కార్యదర్శి నిర్వహించాల్సి రావడంతో కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 8నెలలుగా గ్రామాల్లో ఆర్థికపరమైన సమస్యలు కూడా కార్యదర్శులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ట్రాక్టర్లను మెయింటనెన్స్ చేయ డం నుంచి వీదిలైట్ల వరకు ఏ చిన్న అవసరం వచ్చినా కార్యదర్శులే బాధ్యత తీసుకోవాలి. ఇటీవలే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్న కార్యదర్శులంతా బదిలీల్లో మారిపోయారు. వారు ఖర్చు పెట్టిన డబ్బులు తీసుకోవాలంటే తలప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలోని గ్రామపంచాయతీల్లో చేసిన పనులకు దాదాపు రూ.10 కోట్ల బకాయిలున్నాయి. గ్రామాల్లో వివిధ శాఖల ద్వారా అనేక అభివృద్ధి పనులు సర్పంచు ల ఆధ్వర్యంలోనే చేపట్టారు. ఒక్కో సర్పంచుకు రూ.లక్ష నుంచి రూ.40 లక్షల వరకు చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండి ఇరుక్కుపోయారు. గ్రామ పంచాయతీల్లో మూడు నెలల కిందటి వరకు పారిశుధ్య కార్మికులకే వేతనాలు చెల్లించేందుకు డబ్బులు లేని పరిస్థితి. కార్మికులకు కొంత ఉపశమనం కలిగినా సర్పంచులు చే సిన పనులకు మాత్రం నిధులు విడుదల కావడం లేదు.
గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్న క్రమంలో ప్రభుత్వం ఎట్టకేలకు అరకొరగా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది. కేంద్రం జీపీలకు ఇచ్చిన రూ.220 కోట్లను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ఇటీవల జీపీలకు విడుదల చేసింది. వీటిలో వనపర్తి జిల్లాకు రూ.3.62 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వచ్చిన నిధులు ఏ మూలకు కూడా సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కరూపాయి ఇవ్వకుండా కేవలం కేంద్ర నిధులను మాత్రం కొంత మేర విడుదల చేసి చేతులు దులుపుకొంది. దీంతో తాజా మాజీ సర్పంచులంతా ఆవేదన చెందుతున్నారు.
పక్క ఫొటోలో ఉన్నది.. చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామ పంచాయతీ ట్రాక్టర్. బ్యాటరీ చెడిపోవడంతో ఏడు నెలలుగా కదలడం లేదు. దీంతోపాటు చిన్న.. చిన్న మరమ్మతులు చేయాల్సి ఉన్నది. వీటిని సరిచేసేందుకు జీపీలో నిధులు లేవు. చేసేది లేక ఉన్న దాంట్లో కార్మికుల వేతనాలు, చిన్న పనులతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 8 నెలలుగా ఒక్క రూపాయి కూడా రాలేదు. గత్యంతరం లేకపోడంతో మరమ్మతులకు నోచుకోకుండా ట్రాక్టర్ మూలకు పడింది. ఇద్దరు కార్మికులు పని చేస్తుండగా, రిక్షాలతో చెత్త సేకరణ చేస్తున్నారు.