మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత నెలలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో జాతీయ రహదారులతోపాటు.. మండ ల.. గ్రామీణ స్థాయి రోడ్లు వర్షాల దాటికి కొట్టుకుపోయాయి. వర్షాలు తగ్గి పక్షం రోజులు కావస్తున్నా ఇంకా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారులు భారీఎత్తున దెబ్బతినడంతో అనేక చోట్ల ఇబ్బందులు పడ్డారు.
వీటి మరమ్మతుకు రూ.500 కోట్లకు పైగా అవసరం అవుతాయని అంచనా. అలాగే జిల్లా, మండల గ్రామీణ రహదారులకు మరో వెయ్యి కోట్లకు పైగా కేవలం మరమ్మతులకే అవుతాయని అంచనాలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయా జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. సర్కారు ఖజానాలో పైసలు లేకపోవడం తో మరమ్మతులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్లే జాతీయ రహదారి అనేక చోట్ల దెబ్బతిన్నది. పాలమూరు యూనివర్సిటీ నుంచి దేవరకద్ర వరకు బీటీ రోడ్డు చాలా చోట్ల ధ్వంసమైంది. జడ్చర్ల నుంచి కర్నూల్‌కి వెళ్లే జాతీయ రహదారి కూడా అక్కడక్కడ దెబ్బతిన్నది.
మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రతిరోజూ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా గ్రామీణ రహదారులు చాలా వరకు కొట్టుకుపోయాయి. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడానికి కూడా సర్కారు వద్ద పైసలు లేవని విమర్శలు వస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలోని ఈ పరిస్థితి ఉంటే ఎలా అని ప్రజలు విమర్శిస్తున్నారు. భారీ వర్షాలకు అనేకచోట్ల వాగులు ,వంకలు ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరంతా రోడ్లపైకి చేరి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఇప్పటికీ దాపురించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారుల పరిస్థితిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
అయిజ, సెప్టెంబర్ 7 : అయిజ పట్టణం నుంచి పులికల్తోపాటు ఏపీలోని ఎమ్మిగనూర్, మంత్రాలయం అంతర్రాష్ట్ర రహదారిలోని పోలోని వాగుపై నిర్మించిన తాత్కాలిక పైప్ కల్వర్టు వర్షాలకు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 2.25 కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెనకు శ్రీకారం చుట్టారు. రెండేళ్లుగా పనులు నత్తనడక సాగుతుండటంతో వానకాలం వచ్చిందంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పైప్ కల్వర్టు కొట్టుకుపోతోంది. దీంతో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మూడేండ్ల కిందట హైలెవల్ వంతెనకు బీఆర్ఎస్ సర్కారు శ్రీకారం చుట్టినప్పటికీ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహించడంతో కాంట్రాక్టర్ పనులు పూర్తిగా నిలిపివేశారు. వర్షాల కారణంగా తాత్కాలిక కల్వర్టు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు అదనంగా 7 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అలంపూర్, సెప్టెంబర్ 7 : మండలంలోని రోడ్ల న్నీ గుంతలమయంగా మారాయి. ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్ల కూడా గతుకుల మయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిక ల ముందు అమలు కాని హామీలెన్నో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాటిని విస్మరించింది. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. బూర్దిపాడు నుంచి అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు దారుణంగా తయారైంది. రోడ్లపై మోకాలు లోతు గుంతలు ఉండడంతో వాహనదారులు చాలా ఇ బ్బందులు పడుతున్నారు. మండలంలోని లింగనవాయి, క్యాతూరు, భీమవరం, ఊట్కురు, కోనేరు, బుక్కాపురం తదితర గ్రామాలకు వెళ్లాలంటే ఇరొక్కటే మార్గం. ప్రజాప్రతినిధులు, అధికారులు చూసీచూడనట్లు వ్యహరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రయాణం నరకంగా మారింది. పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
వడ్డేపల్లి, సెప్టెంబర్ 7 : చిన్నపాటి వర్షం పడినా జూలేకల్ గ్రామానికి రాకపోకలు బంద్ అవుతున్నాయి. గ్రామ సమీపంలోని వాగులోని నీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రయాణానికి విద్యార్థులు, రైతులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గ్రామానికి వెళ్లే రోడ్డ్డు అధ్వాన్నంగా తయారైంది. సమస్య తీర్చాలని గ్రామ పెద్దలు, యువకులు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా స్పందన లేదని ఆవేదన చెందుతున్నారు. సమస్య పరిష్కారానికి వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.