వనపర్తి, మే 28(నమస్తే తెలంగాణ) : గడచిన పదేండ్లలో పాలమూరు పల్లె గ్రామాలు సాగునీటి వనరులతో పునర్జీవం పోసుకున్నాయని, వలసలు వెళ్లిన వారంతా తిరిగి వారి..వారి గ్రామాల్లో ఆవాసాలు సుస్థిర పరుచుకున్నారని ప్రముఖ విశ్లేకుడు, తెలంగాణ ఉద్యమకారుడు వీ ప్రకాశ్ అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి కార్యక్రమం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశ్‌తోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ అస్థిత్వం అంటే మన మూలాలు, ఆచారాలు, వనరులు, ప్రాజెక్టులు, సంప్రదా యాలు, చారిత్రక కట్టడాలన్నారు. సరళాసాగర్ ప్రాజెక్టుతో సైఫన్ సిస్టంను వనపర్తికి తెచ్చారని, తెలంగాణ భారతదేశంలో కలువక ముందే సంస్థాన రాజులు వనపర్తిని దేశంలో కలిపారన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంలో వనపర్తి సంస్థానం ఆరితేరిన గడ్డగా పేరుతెచ్చుకున్నదన్నారు. అలాగే దేశంలోకెల్లా 67శాతం పంటలకు యోగ్యమైన భూమి ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉందని ప్రకాశ్ చెప్పారు. కృష్ణా, భీమా, తుంగభద్ర మూడు జీవనదులున్న ప్రాంతం కూడా ఎక్కడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలమూరులో అనేక మార్పులొచ్చాయని, పాలమూరు శ్రమజీవులకు చిరనామా అని, ప్రపంచంలో గుర్తింపున్న నిర్మాణాల్లో పాలమూరు కూలీల శ్రమ ఉందన్నారు. గత పాలకుల పుణ్యమా అంటూ 14 లక్షల మందిని వలసలు పోయేలా చేశారన్నారు. ఇటు సురవరం…అటు సంస్థానాదీశుడు రాజాకృష్ణదేవరావు ఆశయాలకు నిలువుటద్దంగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రకాశ్ పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో హక్కుల కోసం ప్రతిరోజు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి.. బాబా సాహెబ్ అంబేడ్కర్ల రాజకీయ జీవితాలు ఒకేలా అణిచివేతకు గురికాబడ్డాయన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా సురవరం ప్రతాప్ రెడ్డిలాంటి మహోన్నతుడి విశేషాలు తెలియపరచలేదని, మా నడిగడ్డ వాసిగా ఉండి కూడా నాలాంటి వారి దృష్టికి చరిత్రను రానీయక పోవడం అత్యంత శోచనీయమన్నారు. అసెంబ్లీలోనే ఎమ్మెల్యే దాస్యం వినయ్‌బాస్కర్ తెలంగాణ అనే పదం మాట్లాడితేనే అవహేళన చేసిన చరిత్ర ఉన్న సమైక్య రాష్ట్రంలో సురవరంలాంటి తెలంగాణ ముఖ్యుల చరిత్ర ఎంతో మరుగున పడిందన్నారు. గోల్కొండ పత్రికను కుట్రతోనే తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి కావాలని రానివ్వలేదని, ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వచ్చే వరకు మనకు ఓ పత్రిక కూడా లేదన్నారు.
70 ఏళ్ల కిందటే ప్రాథమిక, మానవ హక్కుల గురించి మాట్లాడిన చరిత్ర ఉన్న పాలమూరు చైతన్యం అసామాన్యమైనదన్నారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో అఘాయిత్యానికి గురై పోలీస్‌స్టేషన్‌కు వెళితే పిర్యాదు కూడా తీసుకోలేదని, బాధితుల మీదనే రిటర్న్ కేసు పెట్టిన క్రమంలో ప్రస్తుత సమాజం ఎటు పోతుందని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ బాధితులకు ఆత్మైస్థెర్యం ఇవ్వకపోతే, నిందితుడే దర్జాగా బయట తిరిగేవాడన్నారు. ఆర్టీసీ డ్రైవర్ వడ్లు, మొక్కజొన్న ఎందుకు కొనడం లేదన్న పాపానికి ఉద్యోగంలో నుండే తీసివేశారని ఈ పరిస్థితిలో వాక్ స్వాతంత్య్రం ఎక్కడుందన్నారు. ఈ క్రమంలో హక్కుల గురించి ప్రతిరోజు పోరాడాల్సిన అవసరం ఉందంటూ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి చరిత్రను నవ సమాజానికి అందించేందుకు వనపర్తిలో గత 30 ఏళ్ల నుంచి కృషి జరుగుతుందన్నారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని గతంలోనే ఆలోచించడం జరిగిందని, క్రమేపీ ఫైల్ పెండింగ్‌లో ఉన్నప్పుడే ప్రభుత్వం మారిందని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పారు. సమాజంపై సురవరానికి ఎప్పుడు సంఘర్షణ ఉండేదని, వచనం, కావ్యం, గేయం, పద్యంలాంటివన్ని కోకొల్లలుగా రాస్తూ గోల్కొండ పత్రికకు సం పాదకుడుగా పని చేశారన్నారు.
సంపన్న కుటుంబం నుంచి వచ్చిన సురవరం ఆయన జీవన ప్రయాణంలో అలా ఆశ పడలేదన్నారు. స్వాతం త్య్రం కోసం పోరాడిన సురవరం గురించి వందేళ్ల తర్వాత కూడా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుందని, తెలంగాణలో కవులు లేరన్న ఒక్కమాటకు 355 మంది కవులను ఏకతాటిపైకి తెచ్చి కండ్లు తెరిపించిన గొప్ప ధీశాలి సురవరం అన్నారు. 70 ఏళ్ల కిం దటే మాదిగ దండోరా నామకరణం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. 1952లో వనపర్తిలో ఓడిపోతారని అలంపూర్‌కు చెందిన సురవరంను ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయించిందని, గెలిచిన తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకోకుండా అన్యాయం చేశారన్నారు.
కేవలం వనపర్తికి 13 నెలలు మా త్రమే ఎమ్మెల్యేగా కొనసాగారని, ఆయన ఎమ్మెల్యే అయినందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం లేదని, ఎమ్మె ల్యే పదవికి ఆయనను పరిమితం చేయకూడదన్నారు. సురవరం ప్రతాపరెడ్డికి చెందిన మూడు పుస్తకాలు చదివితే తెలంగాణ చరిత్ర సగం తెలుస్తుందని ఆయన వివరించా రు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వ్యాఖ్యతగా బైరోజు చంద్రశేఖర్ వ్యవహరించగా సహృదయ సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజా మనోహరబాబు, ప్రముఖ రచయిత్రి తం గెళ్ల శ్రీదేవిరెడ్డి ప్రసంగించగా, నిర్వహక బాధ్యులు డాక్టర్ వీరయ్య, శంకర్‌గౌడ్, బలరాం, వనపట్ల సుబ్బ య్య, కిరణ్‌కుమార్, నందిమళ్ల అశోక్, పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. అంతకుముందు సురవరం ప్రతాపరెడ్డి కాంష్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.