పెంట్లవెల్లి, మే 30 : నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం గ్రామ శివారులోని తాటికుంట సమీపంలో భూమి కబ్జాకు గురైందంటూ రెవె న్యూ అధికారులు శనివారం భూ సర్వే పనులు చేపట్టారు. పోలీస్ బందోబస్తుతో అక్కడికి వెళ్లి జేసీబీ సా యంతో సర్వే చేపట్టి కుంట వెడల్పు, పునర్ నిర్మాణ పనులు చేసేందుకు పూనుకోగా ఆగ్రహించిన రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. 2గంటలపాటు అధికారులు, దళిత రైతుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది.
అధికారులు చేసేదేమిలేక సోమవారం వరకు రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు సంబంధించిన కాగితాలు చూపాలని లేకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటామని పెంట్లవెల్లి తాసీల్దార్ భాస్కర్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా దళిత రైతులు కారంగి ఈశ్వరయ్య, సాయిశంకర్, కారంగి పెద్ద గోపాల్, నాగులు, సుంకన్నతోపాటు మొత్తం 15మంది రైతు లు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో మల్లేశ్వరం గ్రామానికి చెందిన రైతులు సర్వం కోల్పోయారని 241, 238 సర్వే నెంబర్లలో 15 మంది దళిత రైతులందరూ ఒక్కొక్కరికీ 15 నుంచి 20గుంటల చొ ప్పున వ్యవసాయం చేసుకుంటూ 45ఏండ్లుగా జీవ నం కొనసాగిస్తున్నమన్నారు.
గ్రామంలో రాజకీయ కక్షతో కావాలనే అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని తాటికుంట పునర్ నిర్మాణం పేరుతో మా భూములను లాకుంటున్నారని దళిత రైతులు మండిపడ్డారు. ఈ విషయంపై తాసీల్దార్ భాస్కర్‌ను వివరణ కోరగా గ్రామంలోని తాటికుంట పునర్ నిర్మాణం చేపట్టాలని కొందరు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే కుంట సమీపంలో సర్వే నిర్వహించి బౌండరీ ఏర్పాటు చేశామని సమాధానమిచ్చారు.