వనపర్తి : హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Former Minister Niranjan Reddy ) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిల్లర కూతలు కూయడం మానుకోవాలని రేవంత్ రెడ్డికి ( Revanth Reddy ) సూచించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏమి చేయాలో పాలుపోక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని వెల్లడించారు. బీఆర్ఎస్ గద్దెలపై చేయి పడితే కాంగ్రెస్ పార్టీని వందమీటర్ల లోతున బొందపెడతారని మరోసారి స్పష్టం చేశారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో అసమానతలు, వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం మొదలయింని, టీడీపీ, కాంగ్రెస్ మోసం మూలంగానే తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని అన్నారు. కొత్త జిల్లాలను ముట్టుకుంటే ప్రభుత్వ నాలికలను ప్రజలు తెగ్గొడతారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాలను శాస్త్రీయంగానే ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణలో ఉన్న కొద్దిమంది ఓట్ల కోసం టీడీపీ గురించి రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు. ఓట్ల కోసం నాటకాలు ఆడితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం అవివేకమని తెలిపారు.