అచ్చంపేట, మార్చి 17 : దోమలపెంట ఎస్ఎల్బీసీ సోరంగంలో చిక్కుకున్న మిగిలిన ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. డీ-1, డీ-2 ప్రదేశాల్లో తవ్వకాలు ముమ్మరం చేశా రు. టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు 24 రోజులుగా సహాయక బృందాలు అన్వేషణ చేస్తున్నా యి. డీ-1ప్రదేశంలో భారీగా నీరు ఉబికి వస్తుండడంతో రెస్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ ఎంతకూ జాడ తెలియకపోవడంతో మరోసారి కేరళ క్యాడవర్ డాగ్స్‌తో మరోసారి గుర్తించేందుకు టన్నెల్లోకి తీసుకెళ్లారు.
సహాయక చర్యలకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో టీబీఎం మిషన్ భాగాలను దక్షిణ మధ్యరైల్యే బృందం గ్యాస్‌కట్టర్ ద్వారా కట్‌చేసి లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ర్యాట్ హోల్మైనర్స్ బృందాలు, డీ-1, డీ-2 ప్రదేశాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ను లోపలికి పంపించారు. రోబోలకు లోపల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి లేదా రేపటి నుంచి రోబోలు పని ప్రారంభిస్తాయని అధికారులు అంటున్నారు.
రోబోలకు నెట్వర్క్ సేవలు అందక అంతరాయం ఏర్పడింది. రోబోకు 5జీ నెట్వర్క్ ఉండాలి, కానీ అక్కడ 3జీ నెట్వర్క్ ఉంది. దీంతో నెట్వర్క్ అందకపోవడంతో రోబోను 3జీతో సేవలు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టన్నెల్ ఆఫీసు వద్ద జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలపై ఎప్పటికపడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.