అచ్చంపేట : దోమల పెంట SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ కోసం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో రక్షణ చర్యలను ముమ్మరం చేశారు. బుధవారం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, SLBC టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
SLBC టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం, లాంటి సహాయక చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మానవ సహాయక సిబ్బంది చేరలేని ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేయడం, మనుషుల కన్నా 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో పనిచేయడం రోబో ప్రత్యేకత అన్నారు.
SLBC టన్నెల్లో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు, సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి రోబోలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్ లోపల ఉన్న శిథిలాలు, మట్టి కుప్పలు, తేమ, ఆక్సిజన్ సమస్యలు వంటి అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని, రోబోలను రంగంలోకి దించినట్లు చెప్పారు.
అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40 HP పంపు సహాయంతో బురదను బయటికి పంపనున్నారు. ఈ రోబో గంటకు 5000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం కలిగి ఉందని అధికారులు తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు రోబోను పరిశీలించారు. అనంతరం అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్‌లోని ప్రమాద ప్రదేశానికి వెళ్లారు.
ప్రస్తుతం సహాయక చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 బృందాలు 24 గంటలపాటు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. సహాయక బృందాలకు అవసరమైన సామాగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.