జడ్చర్ల పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్ చెరువులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కృషితో నల్లచెరువును రూ.5 కోట్లతో, నల్లకుంటను రూ.1.5 కోట్లతో సుందరీకరించారు. అక్కడి పచ్చదనం మధ్య సందర్శకులు సేదతీరుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సందడిగా కనిపిస్తున్నాయి. వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటుతో యువకులు వ్యాయామం చేస్తున్నారు. చిన్నారులు ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతున్నారు.
జడ్చర్ల, నవంబర్ 9 : జడ్చర్ల మున్సిపాలిటీలో రెండు మినీ ట్యాంక్‌బండ్‌లను అందంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తరహా చెరువు చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా తయారుచేశారు. కావేరమ్మపేట గ్రామం వద్ద 44వ జాతీయ రహదారికి అనుకొని ఉన్న నల్లచెరువును దాదాపు రూ.5 కోట్లతో.., బాదేపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న నల్లకుంటను దాదాపు రూ.1.5 కోట్లను వెచ్చించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో మినీట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దారు. కావేరమ్మపేట వద్ద ఉన్న ట్యాంక్‌బండ్‌ను ఏప్రిల్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న పార్కులో చిన్నారులు ఆడుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళలో కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సేదదీరుతున్నారు. అలాగే వాకింగ్ ట్రాక్‌కు రెండు వైపులా పచ్చని చెట్లను నాటడంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ట్యాంక్‌బండ్‌పై పచ్చని చెట్ల మధ్య వాకింగ్ చేస్తూ ప్రజలు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద వినాయక ఘాట్, బతుకమ్మ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే బోటు షికారు సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాకింగ్‌ట్రాక్, లైటింగ్, రెయిలింగ్, ప్లాట్‌ఫాం, ప్లాంటేషన్, కూర్చోవడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, నల్లకుంట మినీ ట్యాంక్‌బండ్‌ను ఇంకా ప్రారంభించలేదు. అక్కడ ఓపెన్జిమ్తోపాటు బండ్‌కు అనుసందానంగా సీసీరోడ్డు నిర్మించనున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం..
పిల్లలు, పెద్దలు వారంలో ఒక రోజు సరదాగా గడిపేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మినీ ట్యాంక్బండ్లు నిర్మించారు. అక్కడ ఉన్న పార్కుల్లో సంతోషంగా గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వాకింగ్ ట్రాక్‌పై ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నడుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. నల్లకుంట మినీట్యాంక్‌బండ్ వద్ద ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేయనున్నాం.
– మహమూద్‌షేక్, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల
ట్యాంక్‌బండ్ అద్భుతం..
జడ్చర్ల మున్సిపాలిటీలోని నల్లచెరువును ట్యాంక్‌బండ్‌గా మార్చి.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడం అభినందనీయం. గతంలో జడ్చర్ల పట్టణంలో పార్కులు లేవు. ఇప్పుడిప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. ప్రజలు చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు. మినీ ట్యాంక్‌బండ్ అద్భుతంగా ఉన్నది.
– షాహీద్, కావేరమ్మపేట
వాకింగ్‌ట్రాక్ బాగుంది..
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గతంలో పట్టణంలో ఇలాంటి అవకాశం లేకపోవడంతో రోడ్లపై నడిచేవాళ్లం. నేడు చెరువులను ట్యాంక్బండ్లుగా తీర్చిదిద్ది ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే పచ్చని మొక్కల మధ్య నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాం.
– శ్రీనివాస్, జడ్చర్ల