అయిజ, జూన్ 14 : తుంగభద్ర నదీజలాలతో అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఆర్డీఎస్ ప్రధానకాల్వ గోడలకు పగుళ్లు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జోగుళాంబ గద్వాల, అయిజ మండలం సింధనూర్ గ్రామ సమీపంలోని ఆర్డీఎస్ ప్రధానకాల్వ లైనింగ్ దెబ్బతినడంతోపాటు హెడ్‌రెగ్యులేటరీ గోడలు పగుళ్లు వచ్చాయి. ప్రతి ఏటా కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (ఆర్డీఎస్) నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు, ఉండవెల్లి, అ లంపూర్ మండలాలకు సా గు, తాగునీరు అందుతోంది.
ఆర్డీఎస్ ప్రధానకాల్వతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతోంది. గత మూడేళ్లుగా కాంగ్రెస్ సర్కారు ఆర్డీఎస్ ప్రధానకాల్వలు, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్‌కు నిధు లు కేటాయించకపోవడంతో లైనింగ్ దెబ్బతినడంతోపాటు హెడ్రెగ్యులేటరీల గోడలు నెర్రెలు వారాయి. కాల్వలకు భారీ వరదలొస్తే నెర్రెల్లోకి నీరు చేరితే గోడలు కూలిపోయి గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి. ఏటా ఆర్డీఎస్ ప్రధానకాల్వలో షిల్ట్ తొలగింపు, లైనింగ్, మరమ్మతులకు నిధులు కేటాయించాల్సిన సర్కారు నిధుల కేటాయింపులో జాప్యం జరుగుతుండటంతో ఆర్డీఎస్ ప్రధానకాల్వతోపాటు డిస్ట్రిబ్యూటరీలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. నిధు లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుండడంతో ఆర్డీఎస్ రైతులు ఆందోళనలో ఉన్నారు.