నోరెత్తితే నల్లమల్లలో పుట్టిన, వనపర్తిలో చదివి, కల్వకుర్తిలో పెరిగిన, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన, పాలమూరు ప్రాంతం నుంచి రెండో ముఖ్యమంత్రిగా ఎదిగిన అని చెప్పుకునే రేవంత్‌రెడ్డి బడ్జెట్లో మాత్రం ఉమ్మడి పాలమూరుకు మొండిచేయి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో 90శాతం పనులు పూర్తి చేసుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు మరో పదిశాతం పనులకు నిధులు కేటాయిస్తే కాల్వలు పూర్తయ్యి జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఇలా చేస్తే కేసీఆర్ పాలనకు మంచి పేరు వస్తుందనే భయంతో నిధులు కేటాయించలేదు.
దీని వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎన్నికల సమయంలో కొడంగల్, నారాయణపేట తనకు రెండు కండ్ల వంటివని, హైదరాబాద్ సికింద్రాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఏడాదిగా కొడంగల్‌కు వచ్చిన నిధుల్లో కనీసం ఒక్క శాతం నిధులు కూడా నారాయణపేటకు రాలేదు. ఇదేనా నీ రెండ్లు కండ్ల సిద్ధాంతం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వాటి ఊసెత్తకపోవడం, పైగా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే మరో మారు ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్న విషయం స్పష్టమవుతున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పక తప్పదు.