నారాయణపేట, ఏప్రిల్ 10 : ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగారం చౌరస్తా సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నారాయణపేట నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పిలుపునిచ్చే అన్ని కార్యక్రమాల్లో నారాయణపేట నియోజకవర్గ కార్యకర్తలు అద్భుతంగా కష్టపడుతున్నారని రాష్ట్ర నాయకత్వం అభినందించిందని, మరింత ఉత్సాహంగా ప్రజా సమస్యలపై పోరాడాలని కోరా రు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తిప్పికొట్టడడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ ముందు వరుసలో ఉండడం అభినందనీయమన్నారు.
సభకు ముందే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో పార్టీ జెండాలను ఆవిషరించాలని సూచించారు. త్వరలోనే డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వం ఉంటుందని, మొదటి సారిగా విద్యార్థి సభ్యత్వం కూడా ఉంటుందని తెలిపారు. గతంలో ఎప్పుడూ సభ్యత్వ నమోదు చేపట్టినా రాష్ట్ర స్థాయిలో నారాయణ పేట నియోజకవర్గం మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వచ్చిందని, ఈసారి కూడా సభ్యత్వ నమోదులో రాష్ట్ర స్థాయిలో నిలబెట్టేందుకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈనెల 27వ తేదీన కార్యకర్తలు వరంగల్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు.