ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అతలాకుతలమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్ల పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ వరదమయంగా మారాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లడంతో గ్రామాలకు పట్టణాలకు రాకపోకలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ చెరువులు కుంటలు వరదలు ముంచెత్తడంతో అలుగుపారి పంట పొలాలను ముంచెత్తాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద ఐటీ పార్కు జాతీయ రహదారి 44తో కనెక్ట్ చేసిన నాలుగు లేన్ల రహదారి తెగిపోవడం.. ఆ సమయంలో అటుగా వస్తున్న మినీ బస్సు చిక్కుకొని బోల్తా పడింది. ఇందులో అమర్‌రాజా ఫ్యాక్టరీకి పని నిమిత్తం వెళుతున్న కార్మికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు అప్పన్నపల్లి సమీపంలో రైల్వే అండర్ పాస్గోడ భారీ వర్షాల ధాటికి కూలిపోయింది.
అప్రమత్తమైన రైల్వే అధికారులు కాచిగూడ కర్నూల్ రైల్వేలైన్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని అనేక అండర్‌పాస్‌లు వరదలతో నిండిపోయాయి.. జడ్చర్ల మండలంలో దుందుభీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. జడ్చర్ల పట్టణంలోని వంద పడకల దవాఖాన వద్ద ప్రవహిస్తున్న వరదనీటిలో చేపలు పట్టేందుకు వెళ్లిన భాను(24) అనే యువకుడు గల్లంతయ్యాడు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని అనేక మధ్య తరహా ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో సంగంబండ, కోయిల్‌సాగర్, సరళసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. జడ్చర్లలో అత్యధికంగా 112 మిలీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 98.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో జలమయమ య్యాయి. దివిటిపల్లి వద్ద వరదకు కోతకు గురైన రహదారిని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఆయా జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. అనేకచోట్ల వరద ప్రభావానికి పంటలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో కోస్గి, దౌల్తాబాద్, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ అండర్ బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్ల పట్టణంలో కావేరమ్మపేట చెరువు అలుగుపారడంతో జాతీయ రహదారి అనుసంధానిస్తూ పట్టణానికి వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. మరోవైపు దివిటిపల్లి వద్ద కూడా జాతీయ రహదారికి వరద తాకిడి వచ్చినప్పటికీ పెద్దగా ప్రమాదం ఏమీలేదని అధికారులు ప్రకటించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో దుందుబీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు రెండు వైపులా అలుగుపారుతున్నది. ఉయ్యాలవాడ -చర్లతిర్మలాపూర్ రోడ్డు పొడవునా వరద పారుతున్నది. తూడుకుర్తి సమీపంలోని మసీద్ వద్ద ఓ బైక్, వ్యక్తి కొట్టుకుపోతుండగా.. అప్రమత్తమైన స్థానికులు కాపాడారు. ఉమా మహేశ్వరం ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తున్నది. ఘాట్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. వరి, పత్తి పంటలు నీట మునిగాయి. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదం జరిగితే సమాచారం ఇవ్వాలని కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. మొత్తంపైన ఉమ్మడి జిల్లాలను వర్షాలు అతలాకు తలం చేశాయి.