కాంగ్రెస్ పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా
కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ
ఒక్కటిగా ఉంటూ.. కేంద్రంలో ఒక్కోసారి ఒక్కొక్కరు అధికా రంలోకి వస్తూ ప్రజలకు మంచిచేయడం మరిచిపోయా రన్నారు. వారసత్వ రాజకీయాలను పుట్టించిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తుంటే.. ఓర్వలేక అవగాహన లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం ఏదో చేశామంటూ స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ గాంధీ చదువుతున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట రూ.కోట్ల అవినీతికి పాల్పడి కనీసం కరెంట్ కూడా ఇవ్వలేక దివాళా తీశారన్నారు. అనంతరం ఆయా పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు దాదాపు 600 మంది బీఆర్ఎస్లో చేరారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 19 : కాంగ్రెస్ నాయకులు ఏనాడూ ప్రజాసంక్షేమం గురించి పట్టించుకోలేదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రం కోసం ఏదో చేశామంటూ స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌గాంధీ చదువుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటూ కాలం వెల్లదీస్తున్నారని, మీ తాతముత్తాతల నుంచి మీరు చేస్తున్నదేమిటంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు రాత్రి, పగలు తేడా లేకుండా తెలంగాణ ఉద్యమం చేశారని, నేడు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములవుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను చూస్తుంటే కడుపు మండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా ఉంటూ.. ఒక్కోసారి ఒక్కొక్కరు అధికారంలోకి వస్తూ ప్రజలకు మంచిచేయడం మరిచిపోయారన్నారు. రాష్ట్రంలో ఇది చేస్తాం.. అది చేస్తాం అని అంటున్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం అధికారంలో ఉన్న చోట ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కేవలం అధికారం వస్తే చాలు.. ప్రజలు ఏమైపోతే మాకేంటి అనేలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు మీ పాలనలో బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఇవ్వలేదని, బీఆర్ఎస్ పాలనలో బీసీ మంత్రినైనా తనకు 7 శాఖలను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు. గత పాలకులు బీసీలను కేవలం ఓటు యంత్రాలుగా భావించారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు అరిగిపోయిన రికార్డులను స్మరించుకుంటూ.. నేనంటే నేను సీఎం అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ లోలోపల కుమ్ములాడుతున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయలేదని, అలాంటప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు నెల రోజులు కూడా అమలు కాలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట రూ.కోట్ల అవినీతికి పాల్పడి కనీసం కరెంట్ కూడా ఇవ్వలేక దివాళా తీశారన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం ప్రారంభించిన రామప్ప టెంపుల్‌కు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఇసుక, మైనింగ్, వైన్ మాఫియా అంటేనే కాంగ్రెస్ అని, ఆ పార్టీ అధ్యక్షులు కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని ఎంతో అహంకారంగా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్నో పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యారన్నారు. మా నాయకుడిలాగా ఒకేమారు టికెట్లు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించాలని సూచించారు. దేశంలోనే అత్యుత్తమ మ్యానిఫెస్టో తమదని, పదేండ్ల పాలనలో ఎలాంటి ఘర్షణలు జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దొంగ సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మహబూబ్‌నగర్ చుట్టూ సమాంతరంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అడుగులేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే తపన తప్పా మరేమి లేదన్నారు. ప్రజలు 45 రోజులు శ్రమించి పనిచేస్తే ఐదేండ్లు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడుతానన్నారు. బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా దూసుకెళ్తున్నదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు రామకృష్ణ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 19 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతున్నారని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, బుగ్గయ్య, హన్మయ్య, లక్ష్మణ్‌తోసహా 100 మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే మెడికల్ ఏజెన్సీస్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్, శ్రీనివాస్, రాబర్ట్ సన్నీ, వెంకటేశ్‌తో సహా మరో 100 మంది, న్యూమోతీనగర్‌కు చెందిన బీజేపీ నేతలు వెంకట్‌స్వామి, ప్రవీణ్‌కుమార్, నరేందర్, నాగరాజు, నరేశ్, బాలకృష్ణతో సహా 100 మంది, టీడీ గుట్టకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, ముదిరాజ్ సంఘం నాయకులు 100 మంది, రజక సంఘం నేతలు నర్సింహులు, పార్వతి, లక్ష్మి, సంజయ్, వెంకటయ్య, సువర్ణతోసహా 200 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు బతుకుదెరువు చూపేదిగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఏపీలో కంటే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంటి స్థలాలు కూడా ఇచ్చారని గుంటూరుకు చెందిన నేతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సింహులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.