కొల్లాపూర్, ఏప్రిల్ 23: జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి అభివర్ణించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు దేశ విచ్చిన్నం కోసం ఉగ్రవాదులు కుట్రపడినట్లు వెల్లడించారు. టూరిస్ట్ ప్రదేశమైన పహాల్గంలో ఉగ్రవాద దాడులలో 27 మంది టూరిస్టులు మృత్యువాత పడ్డారని, ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టులకు వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
క్లిష్టమైన ఈ స్థితిలో పార్టీలకతీతంగా ఉగ్రదాడిని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు తమ దాడితో టూరిస్ట్ ల ప్రాణాలు తీయడంతో పాటు జమ్ము కాశ్మీర్ లోని టూరిజం పై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బ కొట్టారన్నారు. ఉగ్రవాద మూలాలను పూర్తిగా నాశనం చేయాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే శాంతిభద్రతలు కుదుట పడుతున్న వేళ ఉగ్రవాద దాడులు జరగడం విచారకరమన్నారు.
నిరాయుధులైన సామాన్యులను చంపడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రదాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థతో పాటు ఉగ్రవాదులకు సహకారం అందించిన ఉగ్రవాదం మూలాలు ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతపరమైన లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వాల ఆదుకోవాలని ఆయన కోరారు.