కల్వకుర్తి, సెప్టెంబర్ 5 : రెండు నెలలుగా బకాయిలో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం కల్వకుర్తి మండలం మార్చాల గేట్ వద్ద పాడి రైతులు ధర్నా చేపట్టారు. కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై పాలు ఒలకబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి రైతులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులపై వివక్ష ప్రదర్శిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీకి పాలు పోస్తున్నామని, బిల్లులు చెల్లించకుండా అరిగోస పెడుతున్నదన్నారు. 15 రోజలకోసారి ఇచ్చే బిల్లులను చెల్లించకపోగా.. రెండు నెలలకు సంబంధించిన నాలుగు బిల్లులను తమ వద్దే ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలబిల్లులతోనే చాలా కుటుంబాలు కాలం వెల్లదీస్తున్నాయని.. పిల్లలు ఫీజులు, వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. రైతుబంధుతోపాటు పాలబిల్లులు పెండింగ్లో ఉండడంతో వడ్డీ వ్యాపారులతో మిత్తికి తెచ్చుకుంటున్నామన్నారు.
బంగారాన్ని బ్యాంకులో కుదు వ పెట్టుకుంటున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. రుణమాఫీ అరకొరగా చేసి కాంగ్రెస్ సర్కారు నిలువునా మోసం చేసిందన్నారు. ఒక్కో రైతుకు రెండు నెలలకు కలిసి సరాసరిన రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాయితీపై పశువుల దాణాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బా లయ్య, మాజీ సర్పంచ్ సునీత, రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పాలబూత్ అధ్యక్షుడు రాం రెడ్డి, నాయకులు మోహన్రావు, మల్లేశ్, లింగం, నిజాంసర్కార్, తిరుపతయ్య, కిశోర్, మల్లేశ్, బాలరాజు, రమేశ్, కృష్ణ, పాడి రైతులు శేషిరెడ్డి, జంగారెడ్డి, కిశోర్, వెంకట్రెడ్డి, కాశిరెడ్డి, లింగమయ్య, మల్లయ్య, శ్రీను, రాము, రా జు, తాజుద్దీన్, బుచ్చయ్య, శ్రీశైలం, రాముడు ఉన్నారు.