అయిజ, జూన్ 5 : ఇథనాల్ కంపె నీ యాజమాన్యంతో కుమ్మక్కై రైతులపై దండయాత్ర చేయడంతోపాటు కేసులు పెట్టి రిమాండ్కు తరలించినా ఇథనాల్ కంపెనీ పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం కొనసాగించేందుకు 12 గ్రామాల రైతులు పక్కా ప్రణాళికతో ముందుకు అడుగులు వేస్తున్నారు. గురువారం రాజోళి మం డలం పెద్ద ధన్వాడలో చుట్టుపక్కల గ్రామాల రైతు లు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్నెళ్లుగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని, పచ్చ ని పంట పొలాల్లో ఇథనాల్ కంపెనీ స్థాపిస్తే పంట పొలాలతోపాటు భూగర్భ జలాలు కలుషితం అవుతాయని నెత్తినోరు మొత్తుకుంటున్నా తమ గోడును సర్కారు, అధికారులు స్పందించకపోగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలిపి తమను వేధించడంతోపాటు పోరాటం చేస్తున్న తమను పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ధన్వాడ, చిన్నధన్వాడ, నసనూర్, మాన్దొడ్డి, నౌరోజీక్యాంప్, చిన్నతాండ్రపాడు, వేణిసోంపురం, కేశవరం వంటి గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితం అవుతాయని అధికారులకు మొర పెట్టుకున్నా కంపె నీ యాజమాన్యం స్పందించకపోవడంతోపాటు పోలీసులను ఉసిగొల్పి తమపై కేసులు బనాయించిందని ఆరోపిస్తున్నారు.
ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసి న తమను అకారణంగా కేసులు పెట్టడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలోని కొం దరి ప్రోద్బలంతోనే రైతులపై కేసులు వేశారని, కేసులను ఎలాగైనా ఎదుర్కొంటామని చెబుతున్నారు. 12 గ్రా మాల సమిష్టి నిర్ణయంతోనే ఫ్యాక్టరీ రద్దుకు దశల వారీ గా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పచ్చని పంట పొలాలతోపాటు నరడిగడ్డకు జీవనాధారమైన తుంగభద్ర నదీ జలాలను కలుషితం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసే వరకు పోరాటం విరమించేదిలేదన్నారు.
కేసులెందుకు పెడ్తారు?
ఆర్నెళ్లుగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ఉన్నతాధికారులు, పాలకులు, ప్రజాప్రతినిధులకు వినతులు అందజేశామని, కంపెనీ రద్దు చేయాలని నిరసన దీక్షలు చేపట్టి, అధికారంలో ఉన్న మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను కలిసి గోడు వినిపించినా, ఫ్యాక్టరీ ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గు చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు కంపెనీ యాజమాన్యం బౌన్సర్లను పిలిచి పనులు మొదలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నందుకే కడుపు మండి ఇథనాల్ కంపెనీ స్థావరాలపై రైతులు దాడులు చేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు.
కంపెనీ వద్దని ఆందోళనలు చేపట్టినప్పుడు కంపెనీ అనుమతులు రద్దు చేసి ఉంటే నేడు ఇలాంటి ఘటనలు జరిగేవికావన్నారు. కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం, పోలీసులతో రెచ్చగొట్టే విధంగా చేయడంతోనే రైతు లు కంపెనీ గుడిసెలు, కంటైనర్లకు నిప్పుపెట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కంపెనీ స్థావరాలపై దాడులు చేశారనే నెపంతో రైతులను చిత్రహింసలకు గురి చేయడంతోపాటు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారని ఆరోపించారు. కంపెనీ పనులను అడ్డుకుంటే కేసులు పెడ్తరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కంపెనీ రద్దయ్యే వరకు 12 గ్రామాల రైతులు పోరాటం చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.