మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, జనవరి 28: మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు ఇక నుంచి కార్పొరేషన్‌గా మారనున్నది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీలను విలీనం చేస్తూ మొత్తం 60 వార్డులుగా నిర్ణయిస్తూ మున్సిపల్ కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డా.టీకే. శ్రీదేవి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటికే మహబూబ్‌నగర్, భూత్పూర్, బాదేపల్లి(జడ్చర్ల) మున్సిపాలిటీలు ఉండగా.. కొత్తగా దేవరకద్రను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఉన్నతీకరిస్తూ అదనంగా దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీల పరిధిలోని గ్రామాలను విలీనం చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనించింది. హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారులు, రైలుమార్గాలు ఉండడంతో వ్యాపార, వాణిజ్యపరంగా పాలమూరు గ్రేడ్-1 మున్సిపాలిటీగాఅభివృద్ధి చెందింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు కూడా భారీ డిమాండ్ ఉంది. మున్సిపాలిటీ జనాభా సుమారు 3.40లక్షలు దాటింది. కార్పొరేషన్‌కు కావాల్సిన అన్ని రకాల అర్హతలు ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మున్సిపాలిటీని కార్పోరేషన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా నాన్చుతూ వచ్చి.. ఎట్టకేలకు ఏడాది తర్వాత ఆమోదం తెలిపింది. ఈ నూతన నగరపాలక సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.
విలీన జీపీల దస్ర్తాల సేకరణపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామ పంచాయతీల సమగ్ర దస్ర్తాలు, నివేదికల వివరాలు వెంటనే సేకరించాలని కార్పోరేషన్ అధికారులను సీడీఎంఏ ఆదేశించారు. ఇక నుంచి ఆయా జీపీల్లో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతోపాటు గ్రామ పంచాయతీల మినిట్ బుక్స్‌ను నిలిపివేయడంతోపాటు పంచాయతీల ప్రొఫై ల్, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను దివిటిపల్లి, జైనల్లీపూర్ జీపీల కార్యనిర్వాహణ అధికారి, ప్రత్యేకాధికారి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో కొత్త గా బ్యాంకు ఖాతాలు తెరవాలి. ప్రస్తుత బ్యాంకు ఖాతాలన్నింటినీ మూసి వేయాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీలకు సంబంధించిన స్థిర, చరాస్తు వివరాలు, డిపాజిస్టు, పెట్టుబడులు, పంచాయతీ పన్నులు, నాన్టాక్స్ల డీసీబీని చూపే స్టేట్మెంట్, పంచాయతీల్లో కొనసాగుతున్న పథకాల వివరాలను చూపే ప్రకటనలు, పనులు, మెటీరియల్స్ బిల్లులు, మూడేళ్లల్లో జారీ చేయబడిన భవనాలు, లేఅవుట్‌కు సంబధించిన అనుమతులు, ఫిబ్రవరి 6లోగా కార్పొరేషన్ అధికారులు సేకరించాల్సి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.