నవాబ్‌పేట, మే 13 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా నేటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. పదిరోజుల కిందట అధికారులు, నాయకులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా..నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం చూస్తుంటే అధికారుల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మండలంలోని కొల్లూరు, గురుకుంట, లింగంపల్లి, లోకిరేవు, కాకర్లపహాడ్, కారుకొండ గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రా లు ప్రారంభించారు.
అలాగే కొండాపూర్, పోమాల్, రుద్రారం, ఇప్పటూర్, కూచూర్ గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో 10రోజుల కిందట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ఒక్క గ్రామంలో కూ డా కొనుగోళ్లు ప్రారంభించక పోవడం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. మొదట కేంద్రాలకు గన్నీ బ్యాగులు రాలేవని అధికారులు చెప్పా రు. చాలా కేంద్రాలకు రెండు, మూడు రోజుల కిందటే గన్నీ బ్యాగులు వచ్చాయి. అయినా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరి కోతలు ప్రారంభించారు.
కొల్లూరు, లోకిరేవు గ్రామాల్లోని కేంద్రాలకు రైతులు వారం రోజులుగా ధాన్యం తీసుకొస్తుండగా ఇప్పటికే కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. తెచ్చిన ధాన్యాన్ని ఆరబోసుకోవాలనే కేంద్రాల నిర్వాహకుల సూచన మేరకు రైతులు ధాన్యాన్ని ఆరబోసుకొని..మళ్లీ కుప్పలుగా పోశారు. అయినా అక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాలేవు. అలాగే కాకర్లపహాడ్, లింగంపల్లి, కొండాపూర్, కూచూర్, కారుకొండ, రుద్రారం కేంద్రాలకు కూడా రైతులు ధాన్యం తీసుకొచ్చి కుప్పలుగా పోస్తున్నారు.
కానీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. వ్యవసాయ అధికారులు వచ్చి తేమ శాతం చూసి టోకెన్లు రాసివ్వాలని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఏఈవోలు రావడం లేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా..గన్నీ బ్యాగుల, హ మాలీల కొరత కారణంగానే తాము టోకెన్లు రాయడం లేదని ఏఈవోలు పేర్కొంటున్నారు. ఐకేపీ, వ్యవసాయ, సింగిల్‌విండో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగానే సమస్య జఠిలమవుతోందని రైతులు వాపోతున్నారు. తాము ధాన్యం తీసుకొచ్చి వారాలకొద్ది కేంద్రాల్లోనే ఉంటే పరిస్థితి ఏమిటని రైతులు వాపో తున్నారు. వర్షాలు పడితే నష్టపోతామంటున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు.
హమాలీల సమస్యతోనే ఆలస్యం..
చాలా గ్రామాల్లో హమాలీల కొరత కారణంగానే కొనుగోళ్లు ప్రారంభించడంలో ఆలస్యమవుతోందని వెలుగు ఏపీఎం శ్రీహరి పేర్కొన్నారు. కొల్లూరు, లోకిరేవు, కాకర్లపహాడ్ తదితర కేంద్రాలకు ధాన్యం పెద్దఎత్తున వచ్చినప్పటికీ హమాలీలు రాకపోవడంతోనే ప్రారంభిచలేదన్నారు. తీవ్రమైన ఎండల కారణంగా స్థానిక హమాలీలు లారీల్లో లోడింగ్ చేయడానికి భయపడుతున్నారని చెప్పారు. బీహార్ నుంచి హమాలీలు వస్తున్నారని, త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఏపీఎం తెలిపారు.