మహబూబ్ నగర్, జూలై 15: పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు (Private Hospitals) బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణంలోని యునైటెడ్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన ఓ గిరిజన మహిళ మృతిచెందారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్‌పై దాడి చేశారు. దీనికి నిరసనగా పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిటల్స్‌ను మూసివేయాలని, ఎలాంటి సేవలు అందించకూడని నిర్ణయించారు.
నారాయణపేట జిల్లా బోన్పల్లి తండాకు చెందిన దేవమ్మ (60) మూత్రపిండాల సమస్యతో పాలమూరు జిల్లా కేంద్రంలోని యునైటెడ్ ఆసుపత్రిలో ఆదివారం చేరారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని ముందుగా లక్ష రూపాయలు చెల్లించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆ మొత్తం చెల్లించారు. సోమవారం ఉదయం కూడా మరిన్ని డబ్బులు చెల్లించాలని దవాఖాన వర్గాలు వారికి చెప్పారు. అయితే ఆమెకు బాగైన తర్వాత చెల్లిస్తామన్నారు. దీంతో దేవమ్మకు ఏమైనా తమకు సంబంధం లేదని కుటుంబ సభ్యులు సంతకాలు చేయాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ముందు దేవమ్మ ఆరోగ్య పరిస్థితి తెలియజేయాలని, ఆ తర్వాతే డబ్బులు కడతామని, సంతకాలు కూడా చేసేది లేదని డాక్టర్లను నిలదీశారు. దీంతో దేవమ్మ మరణించినట్లు వారికి చెప్పారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు దవాఖానలో ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే దేవమ్మ మరణించిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు నిరసన తెలిపారు. దీంతో హాస్పిటల్‌కు చేరుకున్న టూ టౌన్ సీఐ ఇజాజ్, ఎస్ఐ విజయ భాస్కర్.. డాక్టర్ రామ్మోహన్‌తో కలిసి శాంతియుతంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సర్దిచెబుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్ రామ్మోహన్ చెప్పులతో దాడి చేశారు. దీనికి నిరసనగా పాలమూరులో ప్రవేట్ ఆసుపత్రుల బంద్‌కు పిలుపునిచ్చారు.