గద్వాల, జూన్ 25 : రాజోళి మండలం తుమ్మిళ్ల రీచ్ నుంచి ఇసుక తరలింపులో ఆది నుంచి నడిగడ్డలోని అధికార పార్టీ నాయకులు అడ్డంకులు తగులుతూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఇసుక అందక అవస్థలు పడుతున్నా అవేవి వారికి పట్టవు. “ఎవరు ఏమైతే మా కేంటి.. మా ముడుపులు మాకు కావాలనే” ధోరణిలో వారు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో నడిగడ్డలోని ప్రజలకు అవసరమైన సమయంలో ఇసుక దొరకక అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గత ఏడాది నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేతకు టెండర్ పొందిన కాంట్రాక్టర్ ముడుపులు చెల్లించకపోవడంతో అధికార పార్టీ నేత ఇసుకర సరఫరాను అడ్డుకున్నాడు.
అప్పుడు ఇసుక ధరలు పెరిగి వ్యాపారులతోపాటు గృ హనిర్మాణ దారులు ఇసుక కోసం నానా అవస్థలు పడ్డారు. అయితే కొన్నిరోజుల పాటు ఇసుక సరఫరా సాఫీగా సాగుతుండంగా కాం ట్రాక్టర్ల మధ్య కాసుల పంచాయతీ నెలకొనడంతో ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తులు తుమ్మిళ్ల రీచ్ దగ్గరకు చేరుకొని అక్కడి సైట్ ఇన్చార్జిపై దాడి చేయడంతో మరో సారి ఇసు క సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. తుమ్మిళ్ల రీచ్ నుంచి గత ఏడాది మార్చి, మే నెలల్లో ఇసుక తరలించడానికి జితిని మినరల్స్ అధినేత నెల్లూరి మనీశ్‌కుమార్ టీజీ ఎండీసీ నుంచి అనుమతి పొందారు. మొత్తం 7,04,334 మెట్రిక్ టన్నుల ఇసుకను నది నుంచి బయటకు తీసి తరలించడానికి అనుమతి తీసుకున్నారు. అయితే గత ఏడాది ఇక్క డి అధికార పార్టీ నేత అడ్డుకోవడంతో ఇసుక సరఫరా అనుకున్న స్థాయిలో జరగలేదు.
ఈ నెల మొదటి నుంచి నది నుంచి సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ఇసుకను నది సమీపంలో నిల్వ ఉంచారు. ప్రతి రోజూ ప్రభుత్వ, ప్రైవేట్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు 500 మెట్రిక్ టన్నుల ఇసుకను బయటకు విక్రయిస్తున్నారు. వీరికి జూన్ 1 నుంచి 5 ఏప్రిల్ 2027 వరకు ఇసుకను విక్రయించడానికి టీజీ ఎండీసీ నుంచి అనుమతులు పొందారు. అయితే ప్రస్తుతం డంప్ చేసిన ఇసుకను ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలతోపాటు ఇందిరమ్మ ఇండ్లకు తరలించే క్రమంలో సైట్ ఇన్చార్జిపై దాడి చేయడం వల్ల ఇసుక సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నది. ఇసుక సరఫరా విషయంలో కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగా దాడి చేశారా అనే అనుమానాలకు తావిస్తుంది. నడిగడ్డకు చెందిన అధికార పార్టీ నేతకు ముడుపులు చెల్లించకపోవడం వల్లే అతను ఆంధ్రా నాయకులతో చేతులు కలిపి ఇసుక సరఫరాను అడ్డుకునే క్రమంలో భాగంగానే సైట్ ఇన్చార్జిపై దాడులు చేయించినట్లు తెలిసింది.
ఆంధ్రాప్రాంతానికి చెందిన జితిన్ మినరల్స్ టెండర్ దిక్కంచుకోగా దానిని ప్రసాద్ అనే వ్యక్తి నడుపుతున్నట్లు తెలిసింది. వీరి ఇసుకను తరలించడానికి ఒక లైనింగ్ బ్రోకర్‌ను నియమించుకున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య డబ్బుల విషయంలో తేడా రావడంతో తుమ్మిళ్ల సైట్ ఇన్చార్జిపై దాడి చేశారనేది మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇసుక తరలింపును అడ్డు కోవాలనే ఆలోచనతోనే దాడి చేసినట్లు ఇంకో వాదన కూడా వినిపిస్తుంది. వీరి పంచాయితీ వల్ల నిర్మాణాలు చేపట్టుకునే వారు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక దొరకక అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజూ 500 టన్నుల ఇసుక కమర్షియల్‌గా కాంట్రాక్టర్ బయటకు విక్రయిస్తున్నారు. అయితే.. కేవలం కాసుల పంచాయితీ వల్లే దాడులు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
టీజీ ఎండీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌ల కాంట్రాక్టర్లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన టీడీపీ నాయకులు తెలంగాణలో తుమ్మిళ్ల దగ్గర ఉన్న ఇసుక రీచ్ సైట్ ఇన్చార్జిపై దాడి చేసినా మన పోలీసులు పట్టించుకోక పోవడం పలు విమర్శలకు తావిస్తుంది. సైట్ ఇన్చార్జి ఎల్వీ చౌదరిపై ఆంధ్ర ప్రాతం నుంచి రెండు కార్లలో వచ్చిన ఆరుగురు రాడ్లతో బెదిరించి, అక్కడ ఉన్న రసీదు బుక్ తీసుకెళ్లినా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించడం ఏమిటనేది ప్రశ్నగానే మారింది. 22వ తేదీ దాడి చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు ఎందుకు చేయలేదో పోలీసులకే తెలియాలని దాడికి గురైనా వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ సైట్ ఇన్చార్జిపై దాడి చేసిన విషయాన్ని రాజోళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నేటి వరకు అక్కడి అధికారి కేసు నమోదు చేయక పోవడంతో కాంట్రాక్టర్ ఈ విషయం డీజీపీని కలిసి అక్కడ జరిగిన దాడిపై వివరించనున్నట్లు తెలిసింది. ఇక్కడి అధికార పార్టీ నేత ఒత్తిడి వల్లే కేసు నమోదు చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.