గద్వాల అర్బన్,నవంబర్ 13 : రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితులకు ఒకరికి 35 ఏండ్లు, మరొకరికి 25 ఏండ్లు జైలు శిక్ష విధిస్త్తూ పాస్ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి రవికుమార్ గురువారం తీర్పును వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు జిల్లాలోని ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను గార్లపాడు గ్రామానికి చెందిన చాకలి హరిచంద్ర బాలికకు మాయమాటలు చెప్పి ఏడాదిపాటు తన ఇంట్లో ఉంచుకొని వేధింపులకు గురిచేశాడు. తన కూతురుకి మాయమాటలు చెప్పి వేధింపులకు గురిచేశాడని జూలై 22, 2017 ఏడాదిలో కోదండాపురం పోలీస్‌స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేయగా పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి అప్పటి డీఎస్పీ యాదగిరి విచారణ చేపట్టి చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
గురువారం ఇరువర్గాల వాదన అనంతరం నిందితుడికి 35 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా మైనర్ బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం అందజేయాలని తీర్పును వెల్లడించారు. అలాగే వడ్డేపల్లి మండలకేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందుపురానికి చెం దిన వడ్డె వెంకటరమణ మాయమాటలు చెప్పి పెండ్ల్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేశాడు. మైనర్ తల్లి అక్టోబర్, 10, 2024 శాంతినగర్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అప్పటి డీఎస్పీ సత్యనారాయణ విచారణ చేపట్టి చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
గురువారం ఇరువర్గాల వాదనల అనంతరం నిందితుడు వెంకటరమణకి 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన అప్పటి డీఎస్పీలు యాదగిరి, సత్యనారాయణ, పీపీలు శ్రీనివాస్, వినోద్ కుమా ర్, సాక్షులకు మోటివేషన్ చేసిన ఏఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, ఎస్సై మురళి, నాగశేఖర్ రెడ్డి, కోర్టు లైసెన్స్ అ ధికారులు జిక్కిబాబు, సాయి బాబా ఎస్పీ తోట శ్రీనివాసరావు అభినందించారు.