కొల్లాపూర్, ఆగస్టు 26 : ఎన్నికల ముందు క్రాప్‌లోన్ తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామని, ఎవరైనా తీసుకోని వారు ఉంటే వెంటనే వెళ్లి తీసుకోవాలని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత కొర్రీలు పెడుతున్నది. అర్హత ఉన్న చిన్న, సన్నకారు రైతులను నిలువునా మోసం చేస్తున్నది. మొదటి విడుత రుణమాఫీలో నియోజవర్గంలోని అన్ని వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం సొసైటీల్లో కలిపి ఒక్క రైతుకు కూడా చోటు దక్కలేదంటే మంత్రి జూపల్లి ఇలాకా పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సొసైటీలకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ.. రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేలా చేసింది. మంత్రిగా ప్రా తినిథ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు సెగ్మెంట్లో ని అన్ని సహకార సంఘాల్లో మాయాజాలం చోటు చేసుకున్నది. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఒక్క కొల్లాపూర్‌లోనే దర్శనమిస్తుండడం విశేషం. అర్హత ఉన్నవారికి మాఫీ కాకపోవడం.., అర్హత లేని వారికి చోటు దక్కడం.., ప్రభుత్వ కటాఫ్ తేదీ తరువాత లోన్ తీసుకున్న వారికి కూడా లబ్ధి చేకూరడం వంటి విచిత్రాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీలోగా తీసుకున్న రుణంలో కూడా పది శాతమే మాఫీ అయ్యింది.
ఇదేమిటని సొసైటీల వద్దకు వెళ్లి ప్రశ్నిద్దామనుకున్న రైతులకు గేట్ల తాళాలే ఎదురుపడుతున్నాయి. నియోజకవర్గంలోని 8 సొసైటీ బ్యాంకుల కింద 9,676 మంది అర్హత కలిగిన రైతుల జాబితాను రూపొందిస్తే.. ఇందులో 4,559 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మిగిలిన 5,117 మందికి చోటు దక్కలేదు. ఇదిలా ఉం డగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అనేక సార్లు సమీక్షలో పాల్గొన్న మంత్రి జూపల్లికి సెగ్మెంట్ నుంచి చేదు అనుభవాలే దక్కుతున్నాయి. పెంట్లవెల్లి సొసైటీలో మూడు విడుతల్లో కలిపి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాకపోవడం ఇంకో విచిత్రం.., రైతులను సొసైటీల్లోకి రాకుండా గేట్లకు ఎందుకు తాళాలు వేశారో తెలియకపోవడం శోచనీయం. ఒకవేళ మం త్రి కనుసన్నల్లోనే మాఫీ జరిగిందా? అనే సందేహా లు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పెంట్లవెల్లి సొసైటీలో 499మంది రైతులు ప్రభు త్వం విధించిన కటాఫ్ తేదీలోగా క్రాప్‌లోన్ తీసుకున్నారు. వారందరూ సర్కారు నిబంధనల పరిధిలోనే ఉన్నారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన మూడు విడుతల రుణమాఫీ ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. అర్హత ఉన్నా తమకెందుకు మాఫీ కాలేదని తెలుసుకునేందుకు రైతులు నిత్యం బ్యాంకు లు, సొసైటీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అలసిపోయారు. ఇదిలా ఉండగా, మొదటి విడుత రుణమాఫీ ప్రారంభోత్సవంలో భాగంగా పెంట్లవెల్లి మం డలకేంద్రం సమీపంలోని రామాపురం రైతు వేదికలో మంత్రి జూపల్లి ముఖ్యమంత్రితో వీసీలో పాల్గొన్నారు. అయితే, పెంట్లవెల్లి రైతులు సమావేశానికి హాజరుకాగా.. మాఫీ కాని వారందరూ నిరాశగా వె నుదిరిగారు. 499మంది రైతులకుగానూ రూ. 3.26 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది.
కొల్లాపూర్ సొసైటీలో అర్హత ఉన్న రైతులకు మొం డి‘చెయ్యి’ చూపగా.. అర్హత లేని రైతులకు రుణమా ఫీ కావడం సంచలనంగా మారింది. మాచినేనిపల్లి సొసైటీలో 50 శాతం మందికి మాత్రమే మాఫీ అ య్యింది. సొసైటీలు పంపించిన లిస్ట్‌కు భిన్నంగా అర్హత లేని వారి పేర్లు రావడం విశేషం. దీంతో ఎవరి ప్రమేయంతో ఇలా అనర్హత ఉన్నవారికి మాఫీ అ య్యింది అనే ప్రశ్నలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కొల్లాపూర్ సొసైటీలో 2,416 మంది ఉండ గా.. 1,535 మందికి మాఫీ అయ్యింది. మిగిలిన 881 మంది రైతులకుగానూ రూ. 7,92,67, 103 బడ్జెట్ రావాల్సి ఉన్నది. మాచినేనిపల్లి సొసైటీ లో 540 మంది రైతులకుగానూ 248మందికి మాత్రమే మాఫీ అయ్యింది. మిగిలిన 292మందికి గానూ రూ. 21,97,68,014 మంజూరు కావాల్సి ఉన్నది.
కోడేరు పీఏసీసీఎస్‌లో 2,684మంది రైతులుంటే 1,007 మందికి రుణమాఫీ అయ్యింది. మిగిలిన 1,677 మందికి రూ.17,31,60,229 నిధులు అవసరమవుతాయి. కొండ్రావుపల్లిలో 259 మందికిగానూ 122 మందికి చోటు దక్కగా.. మిగిలిన 137మందికి రూ.85,76,671 డబ్బులు రావాల్సి ఉన్నది. నార్సాయిపల్లిలో 288 మందికిగానూ 104 మందికి మాత్రమే మాఫీ కాగా.. మిగిలిన 174 మం దికి రూ.11,17,9,298 నిధులు రావాల్సి ఉన్నది.
కొత్తపేట పీఏసీసీఎస్‌లో 2,073 మందికిగానూ 1,108 మంది రైతులకు రుణమాఫీ అయ్యింది. మిగిలిన 965 మంది రైతులకు రూ.10.18 కోట్ల మాఫీ కావాల్సి ఉన్నది. పెద్దకొత్తపల్లి సొసైటీలో 917 మంది రైతులకుగానూ 425 మందికి మాత్రమే లబ్ధి చేకూరగా.. మిగిలిన 492 మంది రైతులకు రూ. 3.60 కోట్లు మాఫీ కావాల్సి ఉన్నది.
కేసీఆర్ సర్కారు హయాంలో రుణమాఫీ కోసం పంపించిన విధంగానే ఈ సారి కూడా లిస్ట్‌ను పంపించాం. కానీ 499 మందిలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు. రైతులు నిత్యం సొసైటీ చుట్టూ తిరుగుతున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు. నేను బీఆర్ఎస్ మద్దతుతో సింగిల్‌విండో చైర్మన్‌గా ఉండడం మూలంగానే మా సొసైటీలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదోమోనని అనుమానంగా ఉన్నది. మంత్రి జూపల్లి స్థానికంగా ఉన్న సొసైటీలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం దురదృష్టకరం.
– విజయరామారావు, పెంట్లవెల్లి సింగిల్ విండో చైర్మన్
కొల్లాపూర్ సొసైటీలో రూ.1.50 లక్షల క్రాప్‌లోన్ తీసుకున్నాను. మా కుటుంబంలో నేను ఒక్కడినే పంటరుణం పొందాను. రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకున్నా నేను అర్హుడిని. కానీ, ఎందుకు మాఫీ కాలేదో అర్థం కావడం లేదు. నాకు న్యాయం చేయాలి. అందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆచరణలో చేయలేదు. బ్యాంకు అధికారులను అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. కానీ స్పష్టం ఇవ్వడం లేదు.
– బర్ల ఈశ్వర్‌రెడ్డి, రైతు, కొల్లాపూర్
నాకు మాస్తీపూర్లో రెండెకరాల పొలం ఉన్న ది. రెండేండ్ల కిందట అమరచింత యూనియన్ బ్యాంకులో రూ.40 వేల లోన్ తీసుకున్నాను. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రూ.2 లక్షల లోన్ మాఫీ చేస్తామని చెప్పడంతో అప్పు తెచ్చి బ్యాంకులో రుణం కట్టి రెన్యూవల్ చేసుకున్నా ను. నా లోన్ రూ.లక్ష లోపే ఉన్నందున మొదటి విడుతలోనే వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు సర్కారోళ్లు ఇచ్చిన మూడు విడుతల లిస్ట్‌ల్లో నా పేరు లేదు. నాకు వయస్సు సహకరించకపోయినా నెల నుంచి బ్యాంక్, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను.
– అనంతమ్మ, మస్తీపూర్, అమరచింత మండలం, వనపర్తి జిల్లా