అమ్రాబాద్, డిసెంబర్ 27: ప్రసవం కోసం వెళ్లి మెరుగైన వైద్యసేవలు లేకపోవడంతో తల్లీబిడ్డ మృత్యువు ఒడిలో కలిసిన ఘటన మండలంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన పెర్ముల చిన్ననారాయణ కూతురు స్వర్ణ(23)ను అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన ప్రసాద్‌కు ఇచ్చి వివాహం చేశారు. నెలలు నిండిన స్వర్ణకు సోమవారం రాత్రి 8గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న పదర, అమ్రాబాద్ దవాఖానలకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో 108లో అచ్చంపేట దవాఖానకు చేరినప్పటికీ అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ తీసుకెళ్లాలని చెప్పడంతో రాత్రి 11:45గంటలకు 108లో వెళ్తుండగా అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువై స్వర్ణకు ఫిట్స్ వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ దవాఖానలోనూ సరైన వైద్యసదుపాయం లేకపోవడంతో అర్ధరాత్రి 12:20గంటలకు మ హబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అక్కడ స్వర్ణ మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. శిశువు కూడా పుట్టిన కొంతసేపటికి మృతిచెందినట్లు కుటుంబసభ్యు లు తెలిపారు. వంకేశ్వరం నుంచి సుమారు 180కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకెళ్లినా తల్లీబిడ్డ మృతిచెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయం లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.