నారాయణపేట / ఊట్కూర్ : అధికార పార్టీ నేతల పర్యటనతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ( BRS ) నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు ( Arrest ) చేయడం నారాయణపేట జిల్లాలో (Narayanpet District) గురువారం చోటు చేసుకుంది.
మక్తల్ పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహా ( Chakali Ailamma ) విష్కరణ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఎమ్మెల్యే శంకర్ గతంలో మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో తెల్లవారుజామునే పోలీసులు రంగంలోకి దిగారు.

మక్తల్ సీఐ రామ్‌లాల్, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి లతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మక్తల్‌తో పాటు నర్వ, ఆత్మకూర్, అమరచింత, మాగనూర్, కృష్ణ మండలాల్లోనూ ముందస్తు అరెస్టులు కొనసాగినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
నిరసనకు దిగకముందే నాయకులను అరెస్టు చేయడం ఏ తరహా ప్రజాస్వామ్యమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.