హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో కారణంగా రాష్ట్రంలోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తగిన సాయం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై క్యాబినెట్లో చర్చించినట్టు తెలిపారు. ఈ వానకాలంలో దాదాపు 17 శాతం లోటు వర్షపాతం నమోదైందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కరువు మండలాల ప్రకటనతోపాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తిచేసింది. త్వరలోనే మం త్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదిస్తామని చెప్పారు.

7800 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
ఎల్ నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినంత సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎకడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత కరెంట్‌ను సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.
కోహెడలో పండ్ల మార్కెట్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మారెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం రూ.650 కోట్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై పునఃసమీక్ష చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియా అడ్వైర్టెజింగ్కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది.
రెండు డీఏలకు ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏలలో రెండింటిని వెంటనే మంజూరు చేయాలని నిర్ణ యం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఈ బకాయిలను వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీఏల నిర్ణయంతో ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడుతుందని తెలిపారు.