న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ప్రాణాలకు తెగించి, కోపైలట్‌తో పోరాడి 180 మంది ప్రయాణికులకు కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఆయన రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. విధి నిర్వహణలో తెగువ, సాహసాన్ని చూపి పెద్ద విపత్తును అడ్డుకున్న మచ్చర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. అద్భుతమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యం చూపిన పైలట్ ఒక హీరో అని మోదీ పేర్కొన్నారు.
ఆయన వందలాది మంది ప్రాణాలను కాపాడి, ఘోరమైన విపత్తును తప్పించారని మోదీ పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్నా పైలట్ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారని నెతన్యాహు ప్రశంసించారు. దాడికి గురైనా ఆయన పోరాడారు, కాక్‌పిట్ తలుపు తెరిచారు, దాడిచేసిన వ్యక్తిని సిబ్బంది, ప్రయాణికులు అదుపులోకి తీసుకునేలా చేశారని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడినా తెగువచూపిన భారత పైలట్‌ను హీరోగా ట్రంప్ అభివర్ణించారు. మరోవైపు మచ్చర్‌కు ‘విశిష్ట్ గుజరాత్ గరిమా’ అవార్డును బహూకరించనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కోపైలట్టే విమాన హైజాక్‌కు ప్రయత్నించగా, దానిని పైలట్ స్మిత్ మచ్చర్ దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్రంగా కత్తిపోట్లకు గురయ్యారు కూడా. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. కోపైలట్‌ను అరెస్ట్ చేసి, పైలట్‌కు చికిత్స అందిస్తున్నారు. మచ్చర్‌ను యూఏఈకి తరలించారు.
గొడ్డలితో దాడి?
ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం కెప్టెన్‌పై కోపైలట్ కత్తితో దాడి చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అధికారులు జరిపిన దర్యాప్తులో అతడు దాడి చేసింది కత్తితో కాదని నిర్ధారణ అయ్యింది. వాస్తవానికి అతడు దాడిలో ఉపయోగించింది క్రాష్ యాక్స్ (అత్యవసర సమయంలో ఉపయోగించే గొడ్డలి) అని అధికారులు తెలిపారు.
అనుకోకుండా పైలట్ అయి..
అత్యంత ధైర్యసాహసాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కెప్టెన్ స్మిత్ ఘట్కోపర్కు చెందిన ముంబై వాసి. ఆయన న్యూజిలాండ్‌లో కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ను పొందారు. అలాగే గురుగ్రామ్, మానేసర్‌లోని ఎఫ్‌ఎస్‌టీసీలో తన బోయింగ్ 737 టైప్ రేటింగ్‌ను పూర్తి చేశారు. 2022లో ఆయన ఫ్లైదుబాయ్‌లో చేరకముందు ఒక దశాబ్దం పాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు. ఆయన సోదరుడు కూడా ఫ్లైదుబాయ్‌లో పైలట్‌గా పనిచేశారు. నిత్యం ప్రశాంతంగా ఉంటాడని, కష్టపడే మంచి వృత్తి నిపుణుడని, నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తాడని ఆయన సహచరులు తెలిపారు. నిజానికి తాను పైలట్ కావాలనుకోలేదని, అయితే 19 ఏండ్ల వయసులో విన్న ఓ సెమినార్ ఆ దిశగా అడుగులు వేయించిందని ఓ పాడ్‌కాస్ట్‌లో స్మిత్ తెలిపారు.
టీవీ షో చూసి.. విమానాన్ని కూలకుండా ఆపి..
ఫ్లైదుబాయ్ విమానంలో ఇజ్రాయెల్‌కు చెందిన పౌరుడు చూపిన సమయస్ఫూర్తి ఎంతోమంది ప్రయాణికులను కాపాడింది. ఇజ్రాయెల్‌కు చెందిన యనివ్ హయున్ వృత్తిరీత్యా ప్లంబర్. ‘మేం కాక్‌పిట్‌లోకి వెళ్లేసరికి కోపైలట్ విమాన కంట్రోలర్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నా. అప్పటికే విమానం అదుపు తప్పుతున్నది. వెంటనే నాకు టీవీలో చూసిన ‘ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్’ షో గుర్తుకొచ్చింది. అందులో చూసినది గుర్తు చేసుకుని కంట్రోలర్లను లాగడంతో విమానం మెల్లిగా సర్దుకుంది. అని యనివ్ తెలిపాడు. ఆయనను ఇజ్రాయెల్ ప్రధాని అభినందించారు.