ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
ఒకవైపు సొంతింటి స్థలం లేని నిరుపేదలు.. మరోవైపు ఉన్న కొద్దిపాటి సాగు భూమినే నమ్ముకుని బతికిన ఓ రైతు కుటుంబం. ఇరువురి అవసరాల మధ్య పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని 2.06 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశంగా మారింది.
పెన్‌పహాడ్, నవంబర్ 14 : ఒకవైపు సొంతింటి స్థలం లేని నిరుపేదలు.. మరోవైపు ఉన్న కొద్దిపాటి సాగు భూమినే నమ్ముకుని బతికిన ఓ రైతు కుటుంబం. ఇరువురి అవసరాల మధ్య పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని 2.06 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబరు 73లోని ఈ భూమి కోసం 2007 నుండి నేటి వరకు కొనసాగుతున్న వివాదం ఓ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేయగా.. తాజాగా శనివారం ఇంటి స్థలాల కోసం పలువురు భూమిలో ఎర్రజెండాలు పాతడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది.
అసలేం జరిగింది?
అనంతారం గ్రామానికి చెందిన గార్లపాటి వెంకటరెడ్డికి సర్వే నంబరు 73లో 2.06 ఎకరాల సాగు భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ భూమే కుటుంబానికి జీవనాధారం. 2007లో అప్పటి గ్రామ సర్పంచ్ జానీమియా గ్రామంలో ఇళ్ల స్థలాల అవసరం ఉందని, ఈ భూమిని గ్రామానికి కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు తెలియకుండానే గ్రామ సభలో బాండు పేపరుపై అగ్రిమెంట్ జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటికి కుమారులు చిన్నవారై ఉండడం, చదువుల నిమిత్తం బయట ఉండగా, వెంకటరెడ్డి మద్యం మత్తులో ఉండగా ఎకరాకు రూ.2.50 లక్షల చొప్పున ఒప్పందం కుదిరినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ధర విషయంలో అభ్యంతరం
2008లో అప్పటి సబ్ కలెక్టర్ గ్రామానికి వచ్చి రైతు సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అప్పటి మార్కెట్ ధర అగ్రిమెంట్లో పేర్కొన్న ధరకు అనుగుణంగా లేదని, ఎకరాకు రూ.1.30 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపినట్లు చెబుతున్నారు. ఈ ధరకు భూమి ఇచ్చేందుకు రైతు నిరాకరించడంతో అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని అప్పటి సబ్ కలెక్టర్ ఆర్డీవో, తాసీల్దార్‌కు ఆదేశించినట్లు కుటుంబ సభ్యుల వాదన. అయితే అగ్రిమెంట్ రద్దు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్కులు తీసుకోవాలని ఇంటి చుట్టూ తిరిగినా తీసుకోలేదని రైతు కుటుంబం పేర్కొంది.
డబ్బులు తీసుకోక.. భూమి వదులుకోక
ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసినట్లుగా, సంబంధిత పరిహారం మొత్తాన్ని ఆర్డీఓ ఖాతాలో జమ చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ డబ్బును రైతు తీసుకోకుండా నిరాకరించారని పేర్కొంటున్నారు. తన పిల్లల భవిష్యత్‌కు ఆధారమైన భూమి చేజారిపోతుందనే ఆందోళనతో వెంకటరెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, అనంతరం మతిస్థిమితం కోల్పోయి సంకెళ్లు పడి మృతి చెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
హైకోర్టును ఆశ్రయించిన వారసులు
తండ్రి మరణం తర్వాత భూమిపై హక్కుల కోసం కుమారులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. అప్పటి నుండి భూమి సాగుకు నోచుకోకుండా బీడుగా మారిందని చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా వివాదం పరిష్కారం కాకపోవడంతో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న ఈ కొద్దిపాటి భూమి దక్కకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని వేడుకుంటున్నారు.
జెండాలతో ఆక్రమణ
మరోవైపు గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు, కొత్తగా పెళ్లయిన జంటలు స్థలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొందరు భూమిలో ఎర్రజెండాలు పాతి స్థలాలు తమకు కేటాయించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తొలుత కొందరు దళితులు జెండాలు పాతగా, అనంతరం తామూ నిరుపేదలమేనంటూ ఇతర వర్గాలకు చెందిన వారు సైతం అక్కడికి చేరి జెండాలు పాతినట్లు గ్రామంలో చర్చ సాగుతోంది. దీంతో భూమి వద్ద ఉద్రిక్తత నెలకొనే పరిస్థితి ఏర్పడింది.
రెవెన్యూ, పోలీస్ అధికారుల విచారణ
ఈ మేరకు తాసీల్దార్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ బాలునాయక్, ఆర్ఐ రంజిత్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షీంచారు. జెండాలు, వేసిన తాత్కాలిక గుడిసెలు తొలగించాలని ఆదేశించారు. స్థలం కోసం కలెక్టర్ కు అధికారికంగా దరఖాస్తు పెట్టుకుంటే పరిశీలించి అర్హులు అయితే కేటాయింపులు చేస్తారని చెప్పగా ససేమిరా అనడంతో అధికారులు వెనుతిరిగారు. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కల్పిస్తూనే.. రైతు కుటుంబానికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు, బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
Silver Foil | స్వీట్లపై పైపూతగా ఉపయోగించే వెండి రేకులను తినకూడదా.. అసలు నిజం ఏమిటి..?
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

