మహబూబ్‌గర్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్రకటిక కరెంట్ కోతలు విధిస్తుండడంతో గ్రామాల్లో పట్టణాల్లో ఎడాపెడ చీకటి అలుముకుంటోంది. సమయం సందర్భం లేకుండా కరెంట్‌ను ఆపేస్తున్నారు. పనులు నడుస్తున్నాయని కొన్నిచోట్లా.. సప్లై ట్రిప్ అయిందని మరికొన్ని చోట్లా కారణాలు చెబుతూ విద్యుత్ అధికారులు కాలం గడుపుతున్నారు. ఎండాకాలం ప్రవేశంతో రోజురోజుకు కరెం ట్ కోతలు పెరుగుతున్నాయి. రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వేసిన పంటలను కాపాడుకుందాం అనుకున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చెరువులు, కుంటల్లో నీళ్లు తగ్గుతుండడం బోరు బావుల వద్ద భూగర్భ జలాలు పడిపోతుండడం.. రైతులకు శాపంగా మారాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోన పరిస్థితి బాగుండేదని ఉమ్మ డి జిల్లా రైతాంగం అంటుంది. ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలమైన నీళ్లు ఉండేవని, తాగునీటికి ఢోకా లేకుండా ఉండడమే కాకుండా రైతులకు అవసరమైన కరెంట్ ఇచ్చి ఆదుకున్నదని అప్పటి పరిస్థితులను తలుచుకొంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అని కాంగ్రెస్ సర్కార్ ప్రచారం చేస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 8,36,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు.
ఇందులోనూ సింహభాగం వేలాది ఎకరాల్లో కేవలం వరి సాగయింది. మిగతా మెట్ట పంటల పరిస్థితి కూడా ఇ బ్బందికరంగా మారుతున్నది. ఇక వరి సంగతి మ రింత దుర్భరంగా తయారవుతుంది. కరెంట్‌పై ఆధారపడ్డ రైతులందరికీ కష్టాలు పెరుగుతున్నాయి. కరెంట్ కోతలు ఒకవైపు ఉంటే ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు వేగంగా పడిపోయి బోర్లు సైతం మొరాయిస్తున్నాయి. మరోవైపు ఉన్న కొద్ది పంటను కాపాడుకుందాం అంటే కరెంట్ కోతలు రైతులను వేధిస్తున్నాయి.
దీంతో నిలకడగా లేని కరెంట్‌తో పారిన మడులే మళ్లీ మళ్లీ పారుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 6 గంటలకు త్రీఫేజ్ కరెంట్‌ను నిలిపి వేస్తుండగా మళ్లీ తెల్లవారుజామున 4 గంటలకు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ ఆ వచ్చిన కరెంట్ కూడా అనేక పర్యాయాలు సమాచారం లేకుండానే కట్ అవుతుండడంతో వరి పొలాలకు సాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. లో ఓల్టేజీ సమస్యతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం కూడా జరుగుతుందని రైతాంగం ఆందోళన చెందుతున్నది. మరో 45 రోజులపాటు పొలాలకు నీళ్లు పారాల్సి ఉంది. ఆరుతడి లెక్కల ప్రకారం భీమా, కేఎల్ఐ, జూరాల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నాయి. రైతులు ఆశించిన మేర సాగునీరు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో అప్రటిక విద్యుత్ కోతలు షురూ అయ్యా యి. సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని గోప్పలు చెబుతున్నా చాలా గ్రామాల్లో ఎడాపెడ విద్యుత్ సరఫరాను నిలిపేస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రిళ్లు కరెంట్ లేకపోవడంతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. దాదాపు ఎండాకాలం ప్రారంభమై నెల కూడా కాకముందే కరెంట్ కోతలు షురూ..
కావడంతో మరో రెండు నెలలు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. పట్టణాల్లో రెండు మూడు గంటలు గ్రామాల్లో ఐదు నుంచి ఆరు గంటల పాటు కరెంట్ కోతలు విధిస్తున్నారని జనం పేర్కొంటున్నారు. కరెంట్ కోతల వల్ల తాగునీటి ఇబ్బందులు కూడా తప్పడం లేదని గ్రామాల్లో తాగునీటికి కష్టాలు కూడా మొదలయ్యాయని లబోదిబోమంటున్నారు. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉండొచ్చేమోనని జనం వాపోతున్నారు.