కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా ( Nagarkurnool district ) కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అనూముల రంగ స్వామి (45) హత్య కేసును పోలీసులు (Murder case) ఛేదించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు( Arrest ) చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు( DSP Srinivasulu ) వెల్లడించారు.
శుక్రవారం పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ మహేష్, ఎస్సైలు సతీష్ కుమార్, జగదీశ్వర్‌తో కలిసి కలిసి కేసు వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2న తన భర్తను కిడ్నాప్ చేశారంటూ అతడి భార్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా ఏదుల పులందర్ గౌడ్‌తో ఉన్న పరిచయాలపై దృష్టిని సారించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనూముల రంగస్వామి తనకు తెలిసిన స్వామిజీ గుప్త నిధులు వెలికి తీస్తాడని పులందర్ గౌడ్‌ను నమ్మించాడు. అతడి మాటలు నమ్మి సుమారు ఐదు లక్షల రూపాయలు స్వామిజీకి ఇవ్వడానికి రంగస్వామికి అందజేశారు. అదనంగా మరో ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే స్వామిజీ కన్నెర్ర చేస్తాడని దీంతో కుటుంబంతో సహా బూడిద అవుతావని బెదిరించాడు.
ఈ బెదిరింపులకు భయపడిన పులందర్ గౌడ్, రంగస్వామిని చంపేయాలని నిర్ణయించుకుని ప్రణాళిక వేసుకున్నాడు. ఇందుకు తన సన్నిహితులైన రమేష్, శివ, కర్నాటి సుధాకర్, జక్కుల తిరుపతయ్య, పాలుస భాస్కర్ గౌడ్, సలేశ్వర్ గౌడ్‌ను సంప్రదించి పథకం వేశారు. అడిగిన డబ్బులు ఇస్తామని నమ్మించి జడ్చర్ల నుంచి రంగస్వామిని మహబూబ్ నగర్‌కు తీసుకెళ్లి సలేశ్వర్ గౌడ్ ఇంట్లో చికెన్‌లో అల్ఫాజోలం కలిపి రంగస్వామి ఇవ్వగా స్పృహ కోల్పోయ్యాడు.
అనంతరం తూఫాన్ వాహనంలో పాలుస భాస్కర్ గౌడ్ పనిచేస్తున్న మైలారం గ్రామం మామిడి తోటకు తీసుకెళ్లి గడ్డపారాలతో కొట్టి చంపి గుంత తవ్వి రంగస్వామిని పూడ్చిపెట్టారు. కోడెర్ పోలీసులు నిందితుడి కాల్ డేటా ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడని డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా రమేష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులు ఉపయోగించిన వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను త్వరలో కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.