కందనూలులో కొందరు ఖాకీల తీరు పోలీసు శాఖకు మచ్చ తెస్తోంది. ఇసుక, సెటిల్మెంట్లు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతూ ‘కంచె చేను మేసినట్లు’.. అవినీతిలో కూరుకుపోతున్నారు. దీంతో తరచూ వివాదాస్పదమవుతూ వస్తున్న ఆ శాఖకు సొంత ఉన్నతాధికారులే షాక్ ఇవ్వడం గమనార్హం. ఇసుక అక్రమ వ్యాపారాలకు సహకరిస్తున్నారనే కారణంతో జిల్లాలోని నలుగురు ఎస్సైలను వీఆర్‌కు పంపుతూ మల్టీ
జోన్-2 డీఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దీంతో ఫ్రెండ్లీ పోలీసుల స్థానంలో ప్రభుత్వం మారిన తర్వాత అవినీతి పోలీసింగ్‌గా మారిందన్న అపప్రద ఆ శాఖ మూటగట్టుకుంటోంది.
– నాగర్‌కర్నూల్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ)
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసుల తీరు రాష్ట్రంలో పరువు తీస్తోంది. చిన్న చిన్న గొడవల్లో అతిగా ప్రవర్తించడంతో పాటుగా పలు దందాల్లోనూ మధ్యవర్తులుగా ఉండటం, సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక దందాలో తలదూర్చుతున్నారనే ఆరోపణలు సాధారణంగా పోలీస్ శాఖపై ఎప్పటి నుంచో ఉంటున్నదే.
ఈ క్రమంలో జిల్లాలోని దుందుభీ పరివాహక ప్రాం తాల్లోని వంగూరు, చారకొండ, ఉప్పునుంతల, తా డూరు, తెలకపల్లి, తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారాలకు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అక్రమ వ్యాపారులకు ఈ మండలాల్లోని పోలీసులు సహకరిస్తూ చేతులు తడుపుకొంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులు మాత్రం ఎక్కడా ఇలాంటి చర్యలు జరగడం లేదనే రీతిలో చెప్పుకుంటూ వస్తున్నారు.
పలువురు పోలీసులు అక్రమ దందా చేస్తున్న వారితో చేయి కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టగా.. ఈ తతంగమంతా నిజమని తేలింది. ఇటీవలే మల్టీజీన్-2 డీఐజీ సత్యనారాయణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతున్న పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఇందులో కందనూలు జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లి, వం గూరు, ఉప్పునుంతల ఎస్సైలను వీఆర్‌కు పంపించడం గమనార్హం. మరో ఎస్సైని ఇప్పటికే బదిలీ చేశా రు.
ఇలా పోలీసు శాఖ ఉన్నతాధికారుల విచారణలో 20 మండలాల్లోని ఐదు మంది ఎస్సైలు అక్రమ ఇసుక వ్యాపారానికి సహకరిస్తున్నట్లు తేలడం సంచలనంగా మారింది. ప్రతిరోజూ టిప్పర్లు, ట్రాక్టర్లతో రోడ్ల మీదుగా ఇసుక తరలుతూనే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు.. కానీ అభివృద్ధి పనులు, ఇండ్ల పేర్లతో చెప్పి ఇసుక వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. దీన్ని అరికట్టాల్సిన రెవెన్యూ శాఖ సొంత పనుల్లో మునిగి ఉంటే.. పోలీసు శాఖ తమదే బాధ్యతన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలోని ఐదుగురు ఎస్సైలపై ఇలా అక్రమ ఇసుక వ్యాపారానికి సహకరిస్తున్నారని స్పష్టం కావడంతో ఇప్పటి వరకూ వస్తున్న ఊహాగానాలు నిజమని నమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా గే పలు సంఘటనల్లో కోడి పందేలు, మట్టి తవ్వకాలు, పేకాటకు సహకరించడం, కొందరిని తప్పించడం వంటి సంఘనటలకు పాల్పడుతున్న కొందరు ఖాకీలతో ఉన్నతమైన ఆ శాఖ పరువు బజారున పడుతుందని చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో ఓ కేసులో వెల్దండ ఎస్సై ఏసీబీకి పట్టుబడగా, బ్లూకోర్ట్ కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన సంఘటనతో బాధితులు ఆత్మహత్యాయత్నం చేయగా.. ఒకరిని సస్పెండ్ చేశారు. కోడేరులో పట్టుకున్న మట్టి ట్రాక్టర్‌ను వదిలివేసిన ఘటన చోటు చేసుకున్నది.
ఇసుక అక్రమ వ్యాపారంపై నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గతంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. చా లా వరకు బయటకు రాని సంఘటనలు ఎన్నో ఉన్నా యి. జిల్లా పోలీస్ బాస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పోలీసు శాఖ ప్రతిష్టను కాపాడేలా, నిజాయితీగా ఉంచేలా, అక్రమాల్లో భాగం కాకుండేలా ఓవైపు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు కొందరు పోలీసులు తమకేం పట్టనట్లుగా అక్రమాలో తలదూరుస్తుండటం విశేషం. మొత్తమీద కందనూలు పోలీసు శాఖలో ఒకేసారి నలుగురు ఎస్సైలను అక్రమ ఇసుక వ్యాపారంలో వీఆర్‌కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అవినీతి దందాపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.