మహబూబ్నగర్, మార్చి 30 : మహబూబ్నగర్ జిల్లాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలోని చాంబర్లో జిల్లా పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. అలాగే సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించే ఈద్గాల వద్ద అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. అనంతరం ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎస్పీ తెలియజేశారు. పండుగ సందర్భంగా ప్రజలు సహకరించాలని, సామాజిక సమగ్రతను కాపాడేందుకు పోలీసులకు తోడ్పాటును అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
నాయణపేటలో..
నారాయణపేట, మార్చి 30 : ప్రజలందరూ సోదర భావ ంతో తమ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని పేట ఎస్పీ యోగేశ్గౌతమ్ సూచించారు. ఆదివా రం ఆయన మాట్లాడు తూ రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని ఈద్గాలు, మజీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిని కించపరిచే విధంగా, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టరాదని, సోషల్ మీడియాపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సమాజంలో శాంతి స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని మజీదులు, బువమ్మ గుట్ట ఈద్గా వద్ద పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించి మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్, ప్రధాన చౌరస్తాలలో పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఆయనవెంట ఏఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.