వనపర్తి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్‌రెడ్డి హత్య జరిగి పది నెలలు గడిచింది. ఇప్పటి వరకు హంతకుల జాడ లేకపోవడంతో అందరూ పోలీసుల వైపే చూస్తున్నారు. రాష్ట్రస్థాయిలో రాజకీయ హత్యగా చర్చకు దారితీసిన ఈ ఘటన పోలీసులకు విచారణలో సవాల్‌గా నిలుస్తుంది. నెలలు గడుస్తున్నా.. తమకు ఇంకెప్పుడు న్యాయం చేస్తారంటూ బాధిత కుటుంబం బావురుమంటున్నది. సాయం కోసం..కేసు పురోగతికై వివిధ రాజకీయ పక్షాలను, పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తూ తమకు న్యాయం చేయమని బాధితులు పదే.. పదే ప్రాదేయపడుతూనే ఉన్నారు.
చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లిలో 2024 మే 22న అర్ధరాత్రి తన ఇంటిపక్క కల్లం (దొడ్డి)లో నిద్రిస్తున్న శ్రీధర్‌రెడ్డి హత్యకు గురైన సంగతి విధితమే. హత్య జరిగి నేటితో పది నెలల అవుతున్నది. ఈ ఘటనపై విచారణలో ఇంకా పురోగతి రాలేదు. కు టుంబ సభ్యులు ఇది రాజకీ య హత్య అని ముక్తకంఠంగా పోలీసులకు ముందు నుంచి చెబుతూ వ స్తున్నారు. ఈ ఘటనలో అనేక మందిని పోలీసులు విచారణ జరుపుతూనే ఉన్నారు. స్నేహితులు, రియ ల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలు, ఆర్థికపరమైన సం బంధాలు, రాజకీయ ప్రత్యర్థులు, చివరకు సొంత పార్టీ నాయకులను సహితం పోలీసులు విచారణ చేస్తూ వచ్చారు. ఈ హత్యలో పోలీసులకు తగిన బలమైన సాక్షాల అన్వేషణ ప్రధాన సమస్యగా మారింది.
బాధిత కుటుంబ సభ్యులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులకు అనేక దఫాలుగా కేసును ఛేదించాలని విజ్ఙప్తులు చేస్తూ వస్తున్నారు. శ్రీధర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకుడైనప్పటికీ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులను కలిసి మొరపెట్టుకున్నారు. బీజేపీలో బండి సంజయ్, డీకే అరుణలతోపాటు మరికొంతమంది నాయకుల దృష్టికి హత్య ఘటనను తీసుకెళ్లి న్యాయం చేయమని కోరారు. అలాగే ప్రజాభవన్‌కు వెళ్లి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కేసు డీలా కావడంపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వీటన్నిటి దృష్ట్యా అప్పట్లో మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ గత జూలై 17న లక్ష్మీపల్లి గ్రామాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరి పర్యటనతో త్వరలోనే న్యాయం జరుగుతుందని కు టుంబ సభ్యులు ఆశించారు. ఇక బీఆర్ఎస్ ముందు నుంచి బాధితుల పక్షాన నిలబడింది. రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వరకు కేసులో జరుగుతున్న డీలాను ఎప్పటికప్పుడు పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా రు. జనవరి 20న ఎస్పీ రావుల గిరిధర్‌ను కలిసి కేసులో హంతకులను గుర్తించాలని మరోసారి బీరంతోపాటు చిన్నంబాయి మం డల నాయకులు విజ్ఙప్తి చేశారు. అయినా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
శ్రీధర్ రెడ్డి హత్య కేసు ఛేదించడంలో డీలా జరుగుతుందని ధర్నాల వరకు దారి తీసింది. కుటుంబ సభ్యుల ఆవేదనతో జనవరిలో బీజేపీ నాయకులతోపాటు బీఆర్ఎస్ నాయకులు చిన్నంబాయి మండలంలో ధర్నా చేపట్టారు. నెలలు గడుస్తున్నా.. ఎం దుకు మర్డర్ కేసులో హంతకులను పట్టుకోవడం లేదన్న నాయకుల ప్రశ్నలకు పోలీసుల నుంచే సమాధానాలు రావాలి. లక్ష్మీపల్లిలో జరిగిన దారుణ హత్యపై ముందు నుంచి మెజార్టీ రాజకీయ పక్షాలు ఐక్యంగా ఉన్నాయి. ఇలా వివిధ రాజకీయ పక్షాలు శ్రీధర్‌రెడ్డి హత్యపై డేగ కన్నుతో పరీక్షిస్తున్నాయి. కావాలని కేసును ఒత్తిళ్లతో డీలా చేస్తున్నారన్న వాదనలతో పదే పదే రాష్ట్ర పోలీసు అధికారులను కలుస్తూ హంతకులను పట్టుకోవాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.
శ్రీధర్‌రెడ్డి హత్యలో పురోగతి లేకపోవడంపై పోలీసులకు సవాలుగానే నిలుస్తున్నది. రాజకీయంగా అనేక వాదనలున్నప్పటికీ చివరకు పోలీసులదే ప్రధాన పాత్ర అయినందునా వారిపైకి దృష్టి వెళ్తుంది. పోలీసులు సైతం కేసును ప్రాధాన్యతగా తీసుకున్నప్పటికీ హంతకులను పట్టుకోవడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు. కేసు విచారణలో ఎదురవుతున్న సవాళ్లు.. ప్రతిసవాళ్లను అధిగమించి పురోగతి సాధించాల్సి ఉంది. హంతకులను ఇంకా ఎప్పుడు పట్టుకుంటారన్నట్లు లక్ష్మీపల్లి గ్రామం అమాయకంగా ఎదురు చూస్తుంది. శ్రీధర్‌రెడ్డిని ఎందుకు హత్య చేశారు.. ఎవరు చేశారు అన్న ప్రశ్నలు మాత్రం పది నెలలుగా అంతుపట్టడం లేదు.
శ్రీధర్‌రెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. హత్య సందర్భంలో అందుబాటులో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాం. సాధారణ విచారణలో పక్కా సమాచారం రాలేదు. ఇంకా సరైన వాస్తవాల కోసం సాంకేతికంగా ఫోరెన్సిక్ విధానాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. కేసు విచారణ డీలా అన్నట్లు కనిపిస్తున్నా.. తగిన ఆధారాల కోసమే చర్యలు కొనసాగుతున్నాయి. కొంత ఆలస్యమవుతున్నా త్వరలోనే హంతకులను పట్టుకుంటాం.
– కృష్ణ్ణ, సీఐ, వనపర్తి జిల్లా