జోగుళాంబ- గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఒక వ్యక్తిపై పోలీసు అధికారి, సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరలైన ఘటన ఆలస్యంగా కలకలం రేపింది. కేటీదొడ్డి మండల పరిధిలోని సుల్తాన్ పురం గ్రామ వాసి ఒకరు శనివారం కేటీదొడ్డి మండల కేంద్రంలో వ్యక్తిగత పనులు చూసుకుని మద్యం తాగి ఊరికి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినట్లు తెలిసింది. బ్రీత్ అనలైజర్‌లో ఆయన ఎంత మద్యం తాగాడన్న విషయాన్ని విశ్లేషించారు. దీంతో తన గ్రామంలో పెద్ద మనిషినని, ఇలా చేయడం వల్ల ఊళ్లో తన గౌరవం పోతుందని, మరోమారు ఈ తప్పు చేయను వదిలేయండి సార్ అన్నా పోలీసు అధికారితోపాటు ఇతర సిబ్బంది సహనం కోల్పోయారని, విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసుల దెబ్బలకు రెండు రోజులుగా కర్ణాటకలోని రాయ్‌చూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో సదరు వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడి భార్య.. పోలీసులను ఫోన్ ద్వారా సంప్రదించి.. తన భర్త ఏం చేశాడని చావు దెబ్బలు కొట్టారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు నీళ్లు నమిలారని సమాచారం. ఈ అంశంపై ఆమె బంధువులు సైతం పోలీసులను నిలదీసినట్లు వినికిడి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి బాధితుడి భార్యతోపాటు ఆమె బంధువులు సిద్ధమైనట్లు తెలిసింది. బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తమ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని భావించి సదరు పోలీసు అధికారులు.. బాధితుడి కుటుంబ సభ్యులతో రాజీ చర్చలు జరుపుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.