మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల పో లింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రాత్రి నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశారు.
ప్రచారం ముగిసిన.. ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నా రు. ఇదిలా ఉండగా గద్వాలలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోడ్ ఉల్లంఘించి ఆయా అపార్ట్మెం ట్ల వద్ద.. కొన్ని వార్డుల్లో మీటింగులు పెట్టి ఓటు వేయమని కోరడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 11వ డివిజన్లో ఇద్ద రు సీఐలు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నా రని.. నేరుగా కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరుతున్నట్లు బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
మరోవైపు నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వార్డు పరిధిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికారులు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండగా పోలీసులు మాత్రం విపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. పోలింగ్ రోజు కూడా అధికార పార్టీ ఆయా చోట్ల కావాలని గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు
మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆయా జిల్లా కలెక్టర్ లు సందర్శించారు. మహబూబ్‌నగర్‌లో కలెక్టర్ విజయేందిరబోయి, నాగర్‌కర్నూల్‌లో బదావత్ సంతోష్, వనపర్తిలో ఆదర్శ్ సురభి, గద్వాలలో సంతోష్, నారాయణపేటలో సిక్తాపట్నాయక్లు దగ్గరుండి పర్యవేక్షించారు. పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందినదా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు.
పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో బందోబస్తు మధ్య పంపించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. మరోవైపు మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సాధారణ పరిశీలకురాలు కాత్యాయని దేవి పరిశీలించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తోపాటు భూ త్పూర్, దేవరకద్ర, మున్సిపాలిటీల పం పిణీ కేంద్రాలను ఆమె పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో భారీ బందోబస్తు..
మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తును పరిశీలించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి మాట్లాడుతూ ఈ ఎన్నికల సందర్భంగా మొత్తం 82 వార్డులలో, 143 పోలింగ్ లొకేషన్లలో, 320 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. అందులో 87 క్రిటికల్ పోలింగ్ లొకేషన్లలో ఉన్నాయని తెలిపారు.
ఎ న్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, దీనిని ప్రజలు, రాజకీయ పార్టీలు అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలక్షన్ రోజు, ఎలక్షన్ అనంతరం బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..!
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు పోలింగ్‌పై దృష్టి సారించారు. పోలింగ్ వరకు కూడా అన్ని విధాలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. పోలింగ్ రోజు ఓటర్లు ఎవరిని కనికరిస్తారు అని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కొంతమంది కాంగ్రెస్‌కు అనుకూలంగా నిబంధనలు ఉల్లం ఘించి ప్రచారం చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సోషల్ మీడియా క్లిప్‌ను ఎన్నికల కమిషన్‌కు పంపించారు. మొత్తంపైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పైనే పార్టీలు బేరిజు వేసుకుంటున్నాయి. మరో రెండు రోజుల్లో విజేతలు ఎవరు తేలనున్నది.