మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత.. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం.. ఇచ్చిన హామీలు మరిచిపోవడంతో గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డు ఉద్యమం చర్చనీయాంశం అవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందుగానే గులాబీ శ్రేణులు దూసుకుపోతున్నారు.
మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా గ్రామాల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
గద్వాల నియోజకరవర్గంలో బాసు హనుమంతునాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నారు. అన్నిపార్టీల కంటే ముందే బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మొదటి విడుతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకొని ఆ తర్వాత వెనువెంటనే జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. జిల్లాల్లో రిజర్వేషన్ల అనుకూలంగా రావడంతో ముందస్తు ప్రణాళికలు వేస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జంప్ జిలానీలకు కాకుండా పార్టీని నమ్ముకున్న వారికి సీట్లు కేటాయించే పనిలోపడ్డారు.
సీఎం ఇలాకా బద్ధలు కొట్టేందుకు వ్యూహం
నారాయణపేట జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. గతంలో 11 స్థానాలు ఉండగా తొమిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈసారి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గుండుమాల్, కొత్తపల్లి మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో 13కు చేరింది. ఈసారి స్థానిక ఎన్నికల్లో సీఎం ఇలాకాను బద్ధలు కొట్టాలని మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి పక్కాగా స్కెచ్ వేస్తున్నారు.
గతంలో ఇక్కడ కూడా జెడ్పీ చైర్పర్సన్ పదవి అనుభవించి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. దీంతో ఈసారి సదరు నేతకు టికెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాగా ఈసారి జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ఫోకస్ చేసి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సతీమణి సుచరితను జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేశారు. దీనిపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు.
కందనూలులో కదం తొక్కుతూ..
సీఎం సొంత గ్రామం అచ్చంపేట నియోజకవర్గం నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా కాంగ్రెస్‌కు గులాబీ దళం గట్టిగా చెక్ పెట్టేలా ఉంది. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అచ్చంపేట జనగర్జన పేరుతో నిర్వహించిన సభకు కేటీఆర్ హాజరయ్యారు. కనివిని ఎరుగని రీతిలో ఈ సభ సక్సెస్ అయ్యింది. నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్ని తానై ఈ సభను సక్సెస్ చేశారు. ఇక్కడి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల సమరాన్ని కేటీఆర్ మోగించారు.
ఇదే స్ఫూర్తితో జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్యాదవ్లు ఇప్పటికే అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహంతో నేతలతో చర్చలు జరిపారు. ఈసారి కాంగ్రెస్‌ను మట్టి కరిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేను హడలెత్తిస్తున్న బాసు
గద్వాల జిల్లా కేంద్రంలో లిక్కర్, రేషన్, పత్తి సీడ్ మాఫీయా కోసం పార్టీ మారిన సెట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి బాసు హనుమంతునాయుడు హడలెత్తి స్తున్నారు. పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న బాసు కార్యకర్తలను ఒక్కతాటిపై తీసుకువచ్చారు. ఇటీవల గద్వాల గర్జన పేరుతో నిర్వహించిన సభకు కేటీఆర్‌ను తీసుకువచ్చి కనీవిని ఎరగని రీతిలో విజయవంతం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు
పార్టీలోకి చేరుతున్నారు.
జిల్లా కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తో పాటు ముఖ్య నేతలను ఇటీవల బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అనేకమంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కడుతుండడంతో గద్వాలలో గులాబీ రెపరెపలు ఖాయంగా కనిపిస్తున్నాయి. గద్వాల నియోజకవర్గం అంతా బాసు హనుమంతునాయుడు తిరుగుతూ స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. అందరినీ సమన్వయం చేసి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడంతోపాటు అత్త అల్లుళ్లకు సవాల్ విసురుతున్నారు. మొత్తంమీద స్థానిక సంస్థల ఎన్నికలు గులాబీ దళంలో కొత్త జోష్ నింపుతున్నాయి. అందరూ ఒక్క తాటిపై వచ్చి అన్ని జిల్లాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని.. కేసీఆర్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గిఫ్ట్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు.
పాలమూరుపై ఫోకస్..
ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. మొత్తం 16 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 14 జెడ్పీటీసీలకు గానూ 14 గెలిచి క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించారు.
అయితే దేవరకద్ర నియోజక
వర్గంలో చిన్నచింతకుంటకు చెందిన మాజీ ఎమ్మెల్యే స్వర్ణాసుధాకర్రెడ్డికి జెడ్పీ చైర్పర్సన్ పదవికి అప్పజెబితే.. ఆమె పార్టీకి ద్రోహం చేసి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయింది. ఈసారి పార్టీ మారిన వ్యక్తులకు కాకుండా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నేతలకు అప్పజెప్పాలని భావిస్తున్నారు.
జిల్లా కేంద్రంతోపాటు హన్వాడ మండల కార్యకర్తలతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమావేశాలు నిర్వహించారు. జడ్చర్ల నియోజక
వర్గంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్ని మండల నాయకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేవరకద్ర నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆశావాహుల పేర్లను సేకరించి.. పోటీ ఎక్కువగా ఉన్నచోట కార్యకర్త కూర్చొని మాట్లాడి పేర్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. మొత్తం 16 జెడ్పీటీసీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని పిలుపు నిస్తున్నారు.
వనపర్తి జిల్లాలో సింగిరెడ్డి నేతృత్వంలో..
ఉమ్మడి జిల్లాలో వనపర్తి జిల్లాకు ప్రత్యేకత ఉన్నది. ఈ జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజమైన శైలిలో దూసుకుపోతున్నారు. గండి మండలాల్లో విస్తృతంగా తిరుగుతూ కార్యకర్తలతో ఆశావహులతో సమావేశం అవుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కూడా పార్టీ తరఫున గెలిచిన జెడ్పీ చైర్మన్ పార్టీ మారారు. ఈసారి తిరిగి పార్టీని గెలిపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని చర్చించాలని పిలుపునిస్తున్నారు. అన్ని మండలాల్లో కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈసారి కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకునేలా ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.
గద్వాలలో కాంగ్రెస్‌ను హడలెత్తిస్తున్న చల్లా..
జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని అజేయశక్తిగా మారింది. అలంపూర్‌కు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేరు చెప్తేనే కాంగ్రెస్ నేతలు హడలి పోతున్నారు. గతంలో కూడా చల్లా ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్ పదవి అనుభవించిన సరితా తిరుపతయ్య కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక సంస్థలు ఎన్నికలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సవాలుగా తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి.
ఈ నియోజకవర్గంలో 8 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. జెడ్పీ చైర్మన్‌కు కావలసిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ స్థానం కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యే విజయుడుతో కలిసి పార్టీ నేతలతో సమావేశమై పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.