దోమలపెంట, నవంబర్ 24 : అ మ్రాబాద్ మండలంలోని దోమలపెంట గ్రామస్తులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. కృష్ణానది చెంతనే పారుతున్నా.. శ్రీశైలం ప్రాజె క్టు చేరువనే ఉన్నా.. నీటి కష్టాలు మాత్రం గ్రామాన్ని వీడ డం లేదు. కొంత కాలంగా వారానికోసారి తాగునీరు సరఫరా అవుతున్నది. అది కూడా గంటసేపు అరకొరగా సరఫరా అవుతుండడంతో స్థానికులు నీటిని పట్టుకునేందుకు పోటీ పడాల్సి వస్తున్నది. గ్రామం లో 50 ఏండ్ల కిందట నిర్మించిన ఫిల్టర్ హౌస్, స్టోరేజ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరాయి.
జెన్కో పంపుల ద్వారా వస్తున్న నీరు, ఫిల్టర్ హౌస్లో రెండు 30 హెచ్పీ మోటర్లు ఉన్నాయి. వీటిలో ఒక మోటరు రిపేర్కు గురి కాగా.. ప్రస్తుతం ఒక్క మోటర్ మాత్రమే నడుస్తున్నది. పాత ట్యాంక్ నుంచి 70 శాతం నీళ్లు లీకేజీ అవుతూ వృథాగా పోతున్నాయి. కేవలం 30 శాతం నీరు మాత్రమే స్థానికులకు అందుతున్నది. స్టోరేజ్ ట్యాంక్ మరమ్మతులకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా..
నీటిపారుదల శాఖలో 17 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా అందులో 15 మంది ఉద్యోగ విరమణ పొందగా.. ఇద్దరు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత వేధిస్తుండడం.. నిధుల్లేకపోవడంతో సరిపడా నీటిని సరఫరా చేయడం లేదు. నీళ్లు ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ వనరులు లేవని.. ఒక్క జెన్కో ద్వారా సరఫరా అయ్యే నీరే ఆధారం. గతంలో జెన్కో 30 హెచ్పీ మెటార్ ఇచ్చారు. గత ఎంపీ కోరిక మేరకు జెన్కోకు సీఎస్ఆర్ ఫండ్స్ కింద రూ.2 కోట్ల నిధులు కేటాయించారు. ప్రస్తుతం సీఎస్ఆర్ ఫండ్స్ కింద ఫిల్టర్హౌజ్లో రెండు స్టోరేజ్ ట్యాంకులకు రిపేర్ చేయించి రెండు 30 హెచ్పీ మోటర్లు గ్రామ పంచాయతీకి అందిస్తే వారానికి మూడ్రోజులైనా గ్రామానికి మంచినీరు సరఫరా అవుతుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దోమలపెంట ఫిల్టర్ హౌస్లో స్టోరేజ్ ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నాయి. సిబ్బంది, నిధుల కొరత ఉన్నదని ఉన్నతాధికారులకు వివరించాం. నిధులు విడుదల చేసేందుకు ఫైల్ సిద్ధం చేసి పంపించాం. మంజూరవగా.. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే సిబ్బందిని కూడా నియమించి నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
– కే.శశికుమార్, జూనియర్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ
దోమలపెంటలో మంచినీటి సరఫరాకు మాకు సంబంధం లేదు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోనే ఉన్నది. మిషన్ భగీరథ పథకం ద్వారానే మేము తాగునీటిని అందిస్తాం. నీటి పారుదల శాఖలో సిబ్బంది కొరత ఉన్నది. దీంతో ప్రజలకు దాహర్తి తీర్చేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇద్దరు ఉద్యోగులను తాగునీటి సరఫరా బాధ్యతలను అప్పగించాం.
– జయంత్, పంచాయతీ కార్యదర్శి, దోమలపెంట