గద్వాల, ఆగస్టు 27 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ సర్కారు కృషి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలను పట్టించుకోవడం మానేసింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నానుడి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రజలకు పాలన అందించేందుకుగానూ ప్రత్యేక అధికారులతోపాటు కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలు కావస్తున్నా గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పారిశుధ్య పనులు చేసేందుకు ఇటు కార్యదర్శులు, అటు ప్రత్యేకాధికారులు ముందుకు రావడంలేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 జీపీలు ఉండగా.. అందులో సగం కంటే ఎక్కువ గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన రహదారులపై మురుగునీరు వదిలినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. దవాఖానలకు రోగుల తాకిడి పెరిగింది.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిధులు విడుదల చేయడంతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పల్లెప్రగతి, పట్టణప్రగతి పేరిట పనులు చేపట్టేవారు. దీంతో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దాదాపుగా కనుమరుగయ్యాయి. అయితే, ప్రస్తుత కాం గ్రెస్ పాలనలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్న ది. పెద్ద జీపీలు మినహా చిన్న గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం గ్రా మాల్లో స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమం నిర్వహించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. కనీసం మురుగునీరు నిలిచిన చోట, డ్రైన్ల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేకపోవడంతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తున్నదని కార్యదర్శులు వాపోతున్నారు.
సర్పంచుల పదవీకాలం ముగియడంతో రెండు, మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. అయితే, వారు ఏనాడూ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న దాఖలాలు లేవు. దీంతో వారి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక భారమంతా పంచాయతీ కార్యదర్శులపై మోపడంతోపాటు నిధులు లేకపోవడంతో వారు కూడా చేతులెత్తేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపైకి మురుగునీరు వచ్చి చేరుతున్నది. డ్రైనేజీలను కూడా శుభ్రం చేయకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.