మక్తల్ : రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ( Scholarship) , ఫీజు రియింబర్స్మెంట్ ( Fees reimbursement ) బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ( PDSU ) రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభమైనప్పటికీ మూడు సంవత్సరాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల కు చెందిన విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజ్ రియింబర్స్మెంట్, మెస్ బకాయిలు విడుదల చేయకుండా కాలయాపన చేయడం దారుణమని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్ కార్యాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి అజయ్, నాయకులు గణేష్, అనూష, అఖిల , నవీన్ ,అమ్రేష్, మల్లేష్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు.