మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 16 : పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సీతారామ్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం విద్యా ప్రాధాన్యతను విస్మరించిందన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజాపాలన వస్తుందంటూ ఊదరగొట్టి విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని ప్రణాళికలో రాసుకున్న కాంగ్రెస్ నేడు నిస్సిగ్గుగా 7.3 శాతానికి మించి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం లేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా ఉం డి అసౌకార్యల మధ్య నడుస్తుంటే మరో పక్క స్కిల్ యూనివర్సిటీలు తెస్తామంటూ ప్రగల్బాలకు పోతోందన్నారు. 26వేల పాఠశాలలు మూసివేతకు గురవుతుంటే నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తామని అంటోందని, ఉన్న పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించకుండా కొత్త వాటిని తీసుకురావడంటే విద్యను పెట్టుబడిదారులకు అప్పగించడమే అని ఆరోపించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు శివకుమార్, గౌస్, వెంకటేశ్, గణేశ్, రాకేశ్, మహేశ్, విష్ణుచ, కాశీనాథ్, భీమ్సేన్, ప్రవీణ్‌కుమార్, పరమేశ్, అనిల్, అరుణ్, చిన్న, శ్రీను ఉన్నారు.