మద్దూర్, అక్టోబర్ 8 : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచే యాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవా రం మద్దూర్లోని షాగార్డెన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల గ్యారెంటీ కార్డు ప్రకారంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలన్నింటిని కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజల వద్దకు వెళ్లి చూపించి వాళ్లు మోసాన్ని వివరించాలన్నారు.
బాకీ కార్డులో మహిళలకు రూ.55,000, వృద్దులకు రూ. 44,000, దివ్యాంగులకు రూ.44,000, షాదీముబారక్, కల్యాణలక్మి ఆడ బిడ్డలకు తులం బం గారం చొప్పున బాకీ పడిందని, రైతు భరో సా, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ తదితర హామీలన్నీ ప్రభుత్వం బాకీపడిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎలక్షన్ టైంలో జూటా మాటాలు చెప్పి గెలిచి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. స్థానిక ఎన్నికలకు వచ్చే లీడర్లను బాకీ విషయంలో నిలదీయాలని ప్రజలకు సూచించారు. అలాగే స్థానిక ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో పార్టీ డ్రామా లు ఆడుతుందన్నారని, రేవంత్రెడ్డి అనుచరుడితోనే కోర్టులో పిటిషన్ వేయించి జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు.
వీటిన్నింటితోపాటు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మద్దూరు మండలంలో రమేశ్నాయక్ ఓ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు చెప్పి కనిపించకపోయాడని, ఆయన అదృశ్యానికి కారణమై కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయాలని, అదే విధంగా రమేశ్నాయక్ ఆచూకీని మూ డు రోజుల్లో తెలియజేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొత్తపల్లి, మద్దూర్ బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు మదుసూధన్రెడ్డి, వంచర్ల గోపాల్, సీనియర్ నాయకులు సలీం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, జగదీశ్వర్, శివకుమార్, బసిరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.