కోస్గి, మే 21 : తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్‌రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండు రోజుల కిందట కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ రైతులకు మోస పూరితమైన హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వారి జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గన్నీ బ్యాగుల కొరత ఉన్నదని, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేతగాక ఏదో ఒక సాకు చూపి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల కిందట అకాల వర్షంతో రైతులు ఆరబెట్టుకున్న దాన్యం నీటిలో తడిసిపోతే కనీసం పరిశీలించే సమయం కూడా కాంగ్రెస్ నాయకులకు లేదా అని ప్రశ్నించారు.
రైతులను రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిప్పుతూ మీరు హైదరాబాద్‌లో ఉంటూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నీకు ఓట్లేసి గెలిపించిన రైతులు నష్టపోతే స్పందించే సోయి కూడా లేదా అని సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గానికి ఇద్దరు కలెక్టర్లు ఉన్నా కనీసం రైతుల పరిస్థితిపై వారితో మాట్లాడే సమయం కూడా లేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమయ్యిందని అన్నారు. ఏ పదవి లేకున్నా ఎస్కార్ట్‌తో తిరుగుతూ అన్ని అధికారిక కార్యక్రమాలకు తిరిగే మీ సోదరుడు తిరుపతిరెడ్డికి కూడా రైతుల కష్టాలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఏ రైతుల దయతో మోసపూరిత హామీలతో నమ్మించి కొడంగల్‌లో గెలిచావో అదే రైతులు నిన్ను గద్దె దింపే రోజు త్వరలో వస్తుందన్నారు.
గతంలో కేసీఆర్ హయాంలో రైతు రాజులా ఉండేవాడని, కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకటనర్సింహులు, మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, నాయకులు ఉసేనప్పగౌడ్, జనార్దన్‌రెడ్డి, కోనేరు సాయప్ప, వెంకటేశ్, మధుయాదవ్, బెజ్జు నీలప్ప, మధుసూదన్‌రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కృష్ణ, ఆశప్ప, మోహన్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ సర్పంచులు తిరుపతి, నరేశ్, మద్దూర్ మున్సిపల్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు, నరేశ్గౌడ్తోపాటు స్థానిక నాయకు లు పాల్గొన్నారు.