గద్వాల అర్బన్, నవంబర్ 15 : ఫిట్నెస్ లేని బస్సులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన బస్సులను లాభాల కోసం రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్డాండ్ నుంచి అయిజకు బయలుదేరిన బస్సు మేళ్లచెరువు చౌరస్తా సమీపంలో నిలిచిపోయింది. బస్సులో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులున్నారు.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ డీఎం, సీఐలకు ఫోన్ చేసి గోడు వెల్లబోసుకున్నా ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. బస్సు చెడిపోగా, ఇతర బస్సులు నిలుపకుండా వెళ్లిపోయినట్లు ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ఫిట్నెస్ లేని బస్సులను నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ మురళీకృష్ణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 15 : ఆర్టీసీ బ స్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటనలో 53 మంది సురక్షితంగా బతికి బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి డిపోకు చెందిన షటిల్ ఎక్స్‌ప్రెస్ బస్సు వనపర్తి నుంచి మహబూబ్‌నగర్‌కు బ యలుదేరగా, అడ్డాకుల మండలం గుడిబండ స్టేజీ స మీపంలోని శాఖాపూర్ జాతీయ రహదారి వద్ద బస్సు బ్రేకులు పడలేదన్నారు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై గేర్ల సహాయంతో అదుపుచేస్తూ చెట్టును ఢీకొట్టినట్లు తెలిపారు. దీంతో బస్సులో ఉన్న 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
పెబ్బేరు, నవంబర్ 15 : కరీంనగర్ జిల్లా నుంచి అలంపూర్ జోగుళాంబ అమ్మవారి దర్శనానికి భక్తులతో బయలుదేరిన వోల్వో బస్సు ప్రమాదానికి గురి కాగా, పలువురి గాయాలయ్యాయి. ఈ ఘటన 44వ నెంబరు జాతీయరహదారిపై పెబ్బేరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఎస్సై హరిప్రసాదరెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా దుర్సెడు గ్రామం నుంచి 50మంది భక్తులు కార్తీకమాసాన్ని పురస్కరించుకొని అలంపూర్‌కు బయలుదేరారు. వా రు ప్రయాణిస్తున్న బస్సు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 10మందికి గాయాలయ్యా యి. వీరిని వెంటనే పెబ్బేరు, వనపర్తి దవాఖానలకు తరలించి చికిత్స అందించారు. బస్సు క్లీనర్ మహ్మద్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.