పరిగి, నవంబర్ 22 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పరిగిలోని జింఖాన మైదానంలో పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గండీడ్, మహ్మదాబాద్ మండలాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ పరిగికి చేరుకోకముందే సభాస్థలి పూర్తిగా జనంతో నిండిపోయింది.
సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావించిన పలు అంశాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం, రిజర్వేషన్లు 10శాతానికి పెంచడం వంటివి సీఎం కేసీఆర్ వివరించిన సమయంలో చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కరెంటు ఎన్ని గంటలు ఉండాలంటే 24 గంటలు ఉండాలని, ధరణి కొనసాగాలని సభికులు సీఎం కేసీఆర్‌కు మద్దతు పలికారు. మహేశ్రెడ్డివి గొంతెమ్మ కోరికలు కావని, మహేశ్‌రెడ్డిని గెలిపించండి వంద శాతం ఎన్నికల తర్వాత నెల రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.