Achampet | అచ్చంపేట రూరల్ : పట్టణంలో బహుజన యుద్ధ వీరుడు పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పాలకుల సహకారంతో ముందుకు వెళ్తామని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు అజనమోని నరసింహ కోరారు. పేద ప్రజల కడుపు నింపేందుకు పెత్తందారులపై పోరాటం చేసిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను అచ్చంపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంతో పాటు, సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు.
పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్ హుడ్‌గా సుపరిచితుడని అని పేర్కొన్నారు. ప్రజలను దోచుకుంటున్న దొరల, దేశముఖ్‌ల, అధికారుల, సంపన్నుల ఆస్తులను తీసుకొని, ఇవ్వకపోతే దోచుకుని పేదలకు పంచిపెట్టారన్నారని నేతలు కొనియాడారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడన్నారు. ఆధిపత్య శక్తులైన దేశముఖ్‌లు, కరణం పటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారన్నారు. అచ్చంపేటలో పండుగ సాయన్న విగ్రహా ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం తాలూక ప్రధాన కార్యదర్శి బాలరాజు, నేతలు రేనయ్య, వెంకటయ్య, ముక్తాల వెంకటేష్, భీమన మోని వెంకటయ్య, పాపయ్య, మల్లేష్, సైదులు, పదిర మల్లయ్య, పధిర వెంకటేష్, రేనయ్య, లింగస్వామి కాశన్న యాదవ్, మహబూబ్ ఆలీ, నరసయ్య యాదవ్, మహమోద్ తదితరులు పాల్గొన్నారు.