మహబూబ్‌నగర్, జూన్ 7 : రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న లైబ్రరీ వద్ద మంగళవారం నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నేతలు వెంకటేశ్, ఆస్మాబేగం మాట్లాడుతూ సీఎం రేవంత్.. విద్యాశాఖ, హోంశాఖలు తన వద్ద పెట్టుకొని పోస్టులు పెంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయండంటే నిరుద్యోగ అభ్యర్థులను ఎండ్రిన్ తాగి చావండి.. బావిలో దూకి చావండి.. మీరు చచ్చినా సరే పోస్టులు పెంచమని చెబుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని అడుగుతున్నాం మీరు రైతులకే ఎండ్రిన్, ఎరువులు, పురుగుల మందు అందించడం లేదు.. వారే వాటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మీరు మమ్మల్ని తాగి చావాలంటున్నారు.. ఎక్కడ తీసుకోవాలి.. మీరు ఏమైనా సరఫరా చేస్తారా అని సీఎంను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్యాన్ని గెలిపించిన పాపానికి మమ్మల్నీ చావమంటారా.. అని మండిపడ్డారు. మీరు ఒకవేళ రెండు లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం మాత్రం ఇవ్వకపోతే కచ్చితంగా పాలమూరు నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టతామని వారు హెచ్చరించారు.
ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్, ఆస్మా మాట్లాడుతూ 7వేల పోస్టులు వద్దు మాకు 19 వేలు పోస్టులు ఇవ్వాలని కోరారు. అయ్యా రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఇల్లులు తిరిగి నిన్ను గెలిపిస్తే మమ్మల్ని మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
మమ్మల్ని మభ్యపెట్టి గద్దె నెక్కినావు.. ఏరికోరి తెచ్చుకుంటే మమ్మల్నే ఎగిరెగిరి తంతున్నావని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఇవ్వడం లేదని, అడ్డమైన జీవోలను రద్దు చేసి ఇచ్చే నోటిఫికేషన్లు కోర్టు మెట్లు ఎక్కకుండా చూడాలని కోరుతున్నామని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే.. పాలమూరు నుంచే నిరుద్యోగుల మేనిఫెస్టో ప్రకటించి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు కిరణ్రాథోడ్, తిరుపతి, రాకేశ్గౌడ్తోపాటు నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.