మహబూబ్‌నగర్, జూన్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పార్టీకి నమ్మకంగా పనిచేసే కార్యకర్తలకు తగిన అవకాశాలు లభిస్తాయని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని కొడంగల్ పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో కొడంగల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సర్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు వి. శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇం ద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ జెండాను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీపై నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తల సేవలు మరువలేనివన్నారు. ప్రతిఒక్కరూ సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే నిజాయితీ గల నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తోందని, దేశం లో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటిగా నిలిచిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతోపాటు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించామని గుర్తుచేశారు. భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. అభివృద్ధితోపాటు కార్యకర్తల సంక్షేమం, గౌరవం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు.
రైతుబంధు, రుణమాఫీ, పింఛన్ పెంపు, బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలు, గొల్ల కురుమల అభివృద్ధి పథకాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. రైతులు, మహిళలు, బలహీన వర్గాల సమస్యలను ప్రభు త్వం సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు, లైంగిక దాడులు, పోక్సో కేసులు పెరుగుతున్నాయని, శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సొంత జిల్లాకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలపై వే ధింపులు, అక్రమ కేసులను ఆపి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.