వనపర్తి, (నమస్తే తెలంగాణ) నవంబర్ 6 : వరి పంటలు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచాయి. అలాగే మొక్కజొన్న ధాన్యం సహితం నెల రోజులకు పైగా మార్కెట్కు వస్తున్నది. ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పని మొదలు పెట్టాలంటే ఓ యుద్ధం చేసినంత పని అవుతున్నది. ప్రతి ఏటా నిత్యకృత్యంగా చేసే పనులే అయినా కేంద్రాలు కొనుగోళ్ల పని మొదలు పెట్టేవరకు రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వారం రోజుల కిందట మూడు సెంటర్లను ప్రారంభించినా వాటిలో ఒక్క చోట కూడా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడం విచారకరం.
జిల్లాలోని 15 మండలాల్లో ఈ వానకాలం వరి సాగుబడులు భారీగానే పెరిగాయి. వానకాలం సీజన్ యావత్తు నిండు వర్షాలతో కొనసాగడం వల్ల ఎటు చూసినా వరి పంటలు కనిపిస్తున్నాయి. వరితోపాటు ప్రస్తుతం మొక్కజొన్న సహితం మార్కెట్లకు రావడం తో విక్రయాలపై రైతన్నలు దృష్టి పెట్టారు. వరి, మొ క్కజొన్నలతోపాటు ఇతర మెట్టపంటలు సహితం రైతులకు చేతికి అందుతున్నాయి. జిల్లాలో వానకాలంలో 2,01,477 ఎకరాల్లో వరి శిస్తులు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైనట్లు అంచనాలున్నాయి.
తొమ్మిది మండలాల్లో నిల్..
జిల్లాలోని పది మండలాల్లో ఇప్పటి వరకు కొను
గోలు కేంద్రాల జాడ లేదు. జిల్లా వ్యాప్తంగా దీపావళీ అనంతరం వరి కోతలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని మండలాల్లోనే కేంద్రాలను ప్రారంభం చేసి మమ అనిపిపించారు. పెబ్బేరు, శ్రీరంగాపురం, రేవల్లి, ఏదుల, గోపాల్పేట, వనపర్తి, పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబాయి మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. అయితే.. పెద్దమందడిలో 21కేంద్రాలు, ఖిల్లాఘణపురం 6, కొత్తకోట 15, అమరచింత 4, ఆత్మకూరు 4, మదనాపురంలో 4 కొనుగోలు సెంటర్లను మాత్రమే వారం కిందట ప్రారంభించి వదిలేశారు. ఈ ప్రారంభించిన సెంటర్లలోనూ కొనుగోళ్ల జాడ లేదు. దీంతో రైతులు ఎటూ చూసినా లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్థంగా 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ నిర్ణయించిన సంగతి విధితమే.
ఒక్క గింజ కొంటే ఒట్టు…
జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 53 కేంద్రాలను ప్రారంభించారు. అయితే.. ఈ సెంటర్లలో ఒక్క గింజ కూడా కొనుగోళుకు నోచుకోలేదు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ సెంటర్లో కేవలం వె య్యి క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేశారు. అయి తే.. ఆ రైతులకు మాత్రం ధాన్యం కొన్న రశీదులు ఇవ్వలేదు. సంచులు మార్కెట్లోనే మగ్గుతున్నాయి. మహిళా సంఘం సభ్యులను ఆరా తీస్తే ఏ మిల్లుకు పం పాలో సమాచారం రాలేదన్నారు. అందుకోసమే ఎదు రు చూస్తున్నామని బదులిచ్చారు. తీరా వడ్లు అమ్మినట్లు కనిపిస్తున్నా.. రైతులు మాత్రం ధాన్యంను అనుసరించుకుని మార్కెట్లోనే ఉన్నారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్న క్రమంలో ఇంకా కొనుగోళ్లు మొదలు పెట్టకపో వ డంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కా గా ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఈ సీజన్లో సన్నరకం వడ్లు 3లక్షల 57వేల మెట్రిక్ టన్నులు, అలాగే దొడ్డు రకం వరి 73 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలన్న లక్ష్యం ఉన్నది.
పేరుకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం..
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో పేరుకు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వారం కిందట ప్రారంభం అయిన ఈ కేం ద్రంలో అసలు పని మొదలు కాలేదు. ఇప్పటికే రైతు లు నెల రోజులకుపైగా మార్కెట్కు మొక్కజొన్న తెస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉంటే, ఒక్క క్వింటా మక్క కూడా మద్దతు ధరకు నోచుకోవడం లేదు. మార్కెట్లో ఏ రైతును కదిలించినా రూ.1600కు మాత్రమే క్వింటా చొప్పున మొక్కజొన్న ప్రైవేట్ వ్యాపారులు అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. వారం రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నాని, అధికారులు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నా రు. ఇదిలాఉంటే.. గురువారం కూడా మార్క్ఫెడ్ నిర్వాహకులు మార్కెట్లో తిరిగి వెళ్లిపోయారు తప్పా ఒక్క రైతు మక్కలు కూడా కొనలేదు.
తక్కువ ధరకు అడుగుతున్నరు..
మక్కలు తెచ్చి నాలుగు రోజుల నుంచి మార్కెట్లోనే ఉన్నం. ప్రైవేట్ వ్యాపారులు రూ.1600కు క్వింటా అడుగుతున్నరు. అంత తక్కువ ధరకు అమ్మాలంటే మనసు రావడం లేదు. ఖర్చులు విపరీతంగా పెరిగినయి. వానలతో వేగలేక చస్తున్నాం. మార్కెట్లో ధర రాక గోస పడుతున్నం. మా బాధ ఎవరికి చెప్పిన తీరేట్టు లేదు. విత్తనం విత్తినప్పటి నుంచి చివరి వరకు ఇదే గోస. సర్కార్ కొంటామని చెప్పినరు..కానీ, ఇంకా కొనడం లేదు.
– చెన్నమ్మ, రైతు, మాందాపురం, పాన్గల్ మండలం
గిట్టుబాటు ధర లేదు..
పది రోజుల నుంచి మార్కెట్ యా ర్డులోనే ఉన్నం. నాణ్యమైన మక్కలను తడవకుండా తెచ్చినం. రూ.1600 క్వింటా అడుగుతున్నరు. ఎలా ఇ స్తాం. ఇన్ని ఖర్చులు పెట్టుకుని.. మద్ద తు ధరకు కొంత అటు.. ఇటు కూడా ప్రైవేట్ వ్యాపారులు అడగడం లేదు. చాలా ఘోరంగా ధరలు అడుగు తున్నరు. 50క్వింటాళ్లకు పైగా మక్క లున్నాయి. కొనుగోలు సెంటరు తెరిచినా కొనడం లేదు. పడగాపులు కా స్తున్నం. మద్దతు ధర ఇస్తేనే రైతుకు కొంతమేలు జరుగుతుంది.
– కృష్ణయ్య, రైతు, అచ్యుతాపురం, వనపర్తి మండలం
అధికారులు కన్నెత్తి చూడడం లేదు..
కొనుగోలు చేసేందుకు సన్న, దొడ్డు రకం వడ్లు సిద్ధంగా ఉన్నాయి. వారంకు పైగా ఇక్కడే ఉంటున్నం. మొత్తం 8 ట్రాక్టర్ల వడ్లు తెచ్చి ఆర పెట్టినం. మార్కెట్లో అందరికీ వసతులు లేవు. ముందే వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. సిద్ధంగా ఉన్న ధాన్యం అయినా కొని మిల్లులకు తరలిస్తే రైతులకు మేలుగా ఉంటుంది. కొంటామని చెబుతున్నారు తప్పా అధికారులు రావడం లేదు.. కొనడం లేదు.
– బాలకృష్ణ, రైతు, చిట్యాల, వనపర్తి మండలం