మహబూబ్‌నగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలను సత్వరమే అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్సైజ్, ప్రొహిబిషన్, సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రతి అధికారి తన పరిధిలో ఉన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. భూములకు సంబంధించిన సమస్యలపై ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయేందిరబోయి మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా అధికార యంత్రాంగం త్వరితగతిన స్పందించి నష్టాన్ని నివారించుకోగలిగామని అన్నారు. పంటనష్టం, కూలిన ఇండ్లు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక సైతం పంపించినట్లు తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలను తనిఖీ చేసే బాధ్యతను జిల్లా అధికారులకు అప్పగించామని, సీజనల్ వ్యాధులు అరికట్టడంలో విజయవంతం అయ్యామని వెల్లడించారు.
‘ప్రతి ఫోన్‌కాల్ మాకే.. రోజూ దాదాపుగా 3 వేల ఫోన్‌కాల్స్ ఎమ్మెల్యేలకు వస్తున్నాయ్.! డాక్టర్ వద్దకు వెళ్తే క్యాన్సర్ వస్తుందని చెప్పారు.. మీరు అర్థం చేసుకోవాలి.. ప్రజలు మీకు డైరెక్టుగా ఫోన్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుంటే మీ విధి నిర్వహణలో మీరు ఫెయిల్ అయినట్లే లెక్కా..! ఇది చాలా స్పష్టంగా క్లారిటీగా మా ఎమ్మెల్యేలమంతా అనుకొని మాట్లాడుతున్న విషయం’.. అంటూ జిల్లాలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, జిల్లా అధికారుల పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్యేలకు ఫోన్లు ఎక్కువగా చేస్తున్నారంటే అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తలేరని అర్థం అంటూ పేర్కొన్నారు. ఒక ఎలక్ట్రిసిటీ పోల్ కోసం ఒక ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేయాల్సి వస్తోందని ఇదే విధానం అన్ని శాఖల్లోనూ ఉందని, పోలీసు, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, వ్యవసాయ, పశు సంవర్ధకశాఖ అధికారులు వాళ్ల వాళ్ల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. శాఖల వారీగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లిస్టు ఔట్ చేసి ఉన్నత స్థాయి మొదలు కింది స్థాయి అధికారులందరి జాబితా ఇవ్వాలన్నారు. అధికారులు అందుబాటులో లేకుంటేనే ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తాయన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే విషయం పైకి తీసుకెళ్తామని, ఇది ముఖ్యమంత్రి జిల్లా అనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. మీ వల్ల కాని పనులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలన్నారు.
చాలా వరకు సీట్లపై అధికారులు కూర్చోవడం లేదు.. జిల్లా స్థాయి అధికారులు సైతం అందుబాటులో ఉండటం లేదని అన్నారు. పైఅధికారి లేకుంటే కిందిస్థాయి అధికారి వినే సదుపాయాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. హనీమూన్ డేట్ మీకు, మాకు అయిపోయింది..! ఇప్పుడు మనం పనిచేసే కాలం వచ్చిందన్నారు. మన విధులను సక్రమంగా నిర్వర్తించే కాలం వచ్చింది.. మనందరం కూడా ఒక టీంగా పనిచేసి మన జిల్లాను మార్చుకుందాం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందుకు సాగాలన్నారు.. తాగునీటి సమస్య తీర్చాలి.. సరైన సమయంలో మండలాల ఏఈలు స్పందించడం లేదని .. ‘కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని’ అపోహలు మనపై పెట్టారని అన్నారు.. ఎంపీ ఎన్నికల్లో ఆ ప్రాబ్లం ఫేజ్ చేశాం.. అప్పట్లో నష్టం జరిగింది.
ఇది అధికారులందరికీ తెలుసు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరుకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ జిల్లాలో ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా చర్చ ఉంటుందన్నారు. ఒక కార్యదర్శి బదిలీ అయినా.. 2 నెలలు గడిచినా.. రికార్డులు కొత్తగా వచ్చిన సెక్రటరీకి ఇవ్వలేదంటే ఎన్ని అనుమానాలు వస్తాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు సమన్వయకర్తను ఏర్పాటు చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం స్పందిస్తున్నా.. స్థానిక అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజాసంక్షేమం సాధ్యపడుతుందన్నారు. పత్రికల్లో ఏం వచ్చినా వెంటనే స్పందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.