కొల్లాపూర్ : ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ( Indiramma Houses ) ఇవ్వాలని తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ (DK Madiga ) డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చుక్కాయిపల్లి ( Chukkaipalli ) గ్రామ రెండు, మూడు వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో కొందరు పైరవీకారులు పెత్తనం చలాయిస్తున్నారన్నారు.
కొల్లాపూర్ శాసనసభ్యులు , మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించి నేరుగా లబ్ధిదారుల పేర్లను ప్రకటించాలని సూచించారు. గతంలో గ్రామంలో ఇండ్ల మంజూరులో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు. రెండు వార్డుల్లో మంజూరైన వాటిలో అర్హులను గుర్తించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు కంప్యూటర్లలో నమోదు చేస్తున్న దృష్ట్యా అధికారులెవరైనా ఫోన్ చేస్తే మీ దగ్గర స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వారికి చూపించాలని కోరారు. ఇంటి పత్రాలను చూపిచ్చినంత మాత్రాన ఇల్లు మంజూరు అయినట్లు కాదన్నారు. పైరవీకారులు ఇండ్లు మంజూరు చేయిస్తామని, ఆధార్ కార్డులు, ఇతర డాకుమెంట్స్ అడిగితే ఇవ్వరాదన్నారు.